ఏం జరిగినా దానికి రివర్స్‌లో ప్రచారం చేస్తూ ఫేక్ చేయడమే వైసీపీ ఫేక్ వారియర్స్ పని. దాని వల్ల ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని అనుకుంటారో ఏమో కానీ.. తనపై కేసులు నమోదవుతాయని మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. ఇటీవల ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన శ్రీవారిని సామాన్యుడిగానే దర్శించుకున్నారు. దేవుడి దగ్గర వీఐపీ తనం ఏమిటని ఆయన గట్టిగా నమ్ముతారు. అందుకే అలాగే దర్శనం చేసుకున్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని, ఉన్నతతత్వాన్ని గౌరవించాల్సింది పోయి .. వైసీపీ ఫేక్ కార్యకర్తలు తప్పుడు ప్రచారం ప్రారంభించారు.
చాగంటి కోటేశ్వరరావును టీటీడీ అవమానించిందని.. ఆయనకు వీఐపీ దర్శనం చేయించలేదని.. అదనీ.. ఇదనీ ప్రచారం చేయడమే కాదు..వీడియోలు కూడా వదిలారు. ఎన్నికల సమయం నుంచి వైసీపీ నుంచి డబ్బులు తీసుకుని ప్రచారం చేసిన జర్నలిస్టు వైఎన్ఆర్ అనే వ్యక్తి కూడా ఇందులో కీలకం. ఆయనపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఒకప్పుడు ఏబీఎన్‌లో పని చేసి.. జగన్ రెడ్డి, వైసీపీపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి .. ఇప్పుడు అదే పార్టీ దగ్గర డబ్బులు తీసుకుని యూట్యూబ్ చానల్ నడుపుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి.
ఈ జర్నలిస్టు వైఎన్ఆర్తోపాటు డైలీ న్యూస్, పోస్ట్ 360 అనే యూట్యూబ్ చానళ్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ పై కేసులు పెట్టారు. ఇది గౌరవనీయ వ్యక్తులు, సంస్థల ప్రతిష్టను దిగజార్చడానికి చేసిన కుట్ర అని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిని అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లుగా పోలీసులు వర్గాలు చెబుతున్నాయి.