తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం జర్నలిస్టులను చంపేస్తానని బెదిరించారు. తనపై తప్పుడు కథనాలు రాస్తున్నారని ఆధారాలు చూపించకపోతే రైలు పట్టాలపై పండుకోబెట్టి చంపేస్తానని హెచ్చరించారు. ఆలూరు నుంచి గుంతకల్లుకు మారిన ఆయన అక్కడ విజయం సాధించారు. అయితే ఇటీవల ఆయనపై పలు రకాల ఆరోపణలు వస్తున్నాయి. భూ అక్రమాలతో పాటు బంధువుల పెత్తనం పెరిగిపోయిందని లోకల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వీటిపై ఆయన అసహనానికి గురవుతున్నారు.
గుమ్మనూరు జయరాం గతంలో కర్నూలు జిల్లా ఆలూరు నుంచి రెండు సార్లు వైసీపీ తరపున గెలిచారు. మంత్రిగా కూడా చేశారు. ఎన్నికలకు ముందు మంత్రి పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఆలూరులో ఆయనపై ఎన్నో వివాదాలు ఉండేవి. కర్ణాటక సరిహద్దు కావడంతో అక్కడి నుంచి మద్యం తేవడం.. పేకాట శిబిరాలు నిర్వహించడం వంటివి చేసేవారని ఆరోపణలు ఉన్నాయి. తర్వాత బెంజ్ కారు ఓ కాంట్రాక్టర్ నుంచి బహుమతిగా తీసుకున్నారని ఆయనను బెంజ్ మంత్రి అని అప్పట్లో టీడీపీ నేతలు విమర్శించేవారు.
టీడీపీలో చేరిన తర్వాత ఆయనపై ఆలూరులో ఆయనపై వ్యతిరేకత ఉండటంతో ఆయనను గుంతకల్లుకు మార్పించారు. రాష్ట్రం మొత్తం మీద కూటమి ఓడిపోయిన పదకొండు సీట్లలో ఆలూరు కూడా ఒకటి. ఇప్పుడు గుంతకల్లులోనూ గుమ్మనూరు జయరాంపై ఆరోపణలు వస్తున్నాయి. మీడియాలో వార్తలు వస్తూండటంతో ఆయన అసహనానికి గురవుతున్నారు. టీడీపీ హైకమాండ్ ఇలాంటి ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయాలన్న సూచనలు వస్తున్నాయి.