తెలుగు దర్శకులతో పని చేయడానికి పర భాషా హీరోలు మొగ్గు చూపిస్తున్నారు. ధనుష్, దుల్కర్ సల్మాన్ ఇప్పటికే తెలుగు దర్శకుల మాయలో పడిపోయారు. ఇప్పుడు సూర్య వంతు వచ్చింది. తెలుగులో ఎప్పటి నుంచో ఓ సినిమా చేయాలనుకొంటున్నాడు సూర్య. త్రివిక్రమ్, పూరి జగన్నాథ్ లాంటి వాళ్లతో సూర్య సినిమా చేస్తాడని చెప్పుకొన్నారు. మధ్యలో బోయపాటి శ్రీను పేరు కూడా గట్టిగా వినిపించింది. అయితే ఇప్పుడు చందూ మొండేటితో సినిమా చేయాలని ఫిక్సయ్యాడు సూర్య. త్వరలోనే చందూ మొండేటి దర్శకత్వంలో సూర్య కథానాయకుడిగా సినిమా పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ విషయంపై దర్శకుడు చందూ మొండేటి తెలుగు 360తో ప్రత్యేకంగా మాట్లాడారు. ”కార్తికేయ 2 సినిమా సూర్య గారికి బాగా నచ్చింది. ఆ సినిమా విడుదలైన తరవాత నాతో మాట్లాడారు. కలిసి సినిమా చేద్దామని ఆఫర్ ఇచ్చారు. నేను ఆయనకు రెండు కథలు కూడా వినిపించాను. అవి రెండూ ఆయనకు నచ్చేశాయి. రెండింటిలో ఒకటి ఫైనల్ చేయాల్సివుంది” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ‘తండేల్’ పనుల్లో బిజీగా ఉన్నారు చందూ. ఫిబ్రవరి 7న ఈ సినిమా విడుదల కానుంది. నాగచైతన్య కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. తండేల్ తరవాత సూర్య సినిమా పట్టాలెక్కుతుంది. ఆ తరవాతే కార్తికేయ 3 ఉంటుంది.