తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని అనుకుంటోంది. కానీ ఎప్పటికప్పుడు బీసీ రిజర్వేషన్ల సమస్య వారికి అడ్డం పడుతోంది. 42 శాతం బిసీ రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. డిక్లరేషన్ కూడా ఇచ్చింది. కానీ ఉండే రిజర్వేషన్లను పరిమితి పెరిగిపోయిన కారణంగా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కారణంగా న్యాయపరంగా అయితే 42 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాదు.
అందుకే రేవంత్ ప్రభుత్వం ఓ డెడికేటెడ్ కమిషన్ ను నియమించింది. ఆ కమిటీ రిపోర్టు ద్వారా రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారు. ఆ కమిటీ రిపోర్టు ఫిబ్రవరిలో వచ్చేలా చూడాలనుకుంటున్నారు. రిపోర్టు ఇచ్చిన తర్వాత వేగంగా ముందుకెళ్లేలా చూడాలనుకుంటున్నారు. రిజర్వేషన్లు కల్పించిన తర్వాత ఎవరైనా మళ్లీ కోర్టులకు వెళ్తే చిక్కులు వస్తాయి. ఎన్నికల ప్రక్రియ ఆగిపోతుంది. కోర్టుకు వెళ్లరు అని ఆశించడం కూడా సాధ్యం కాదు. అందుకే న్యాయపరమైన చిక్కులు రాకుండా రిజర్వేషన్ల సంగతి తేల్చాల్సి ఉంది.
దాదాపుగా ఏడెనిమిది నెలల నుంచి వచ్చే నేలలోనే స్థానిక ఎన్నికలు అన్న ప్రచారం చేస్తూ వస్తున్నారు. కానీ ఇప్పటికీ ఏం చేయాలన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. పథకాలు.. ఇతర వాటి సంగతి ఎలా ఉన్నా..అసలు సమస్య రిజర్వేషన్లతోనే వస్తోంది. ఈ చిక్కుముడి వీడటం అంత తేలిక కాదన్న భావన ఉంది. స్థానిక ఎన్నికలు పూర్తి అయితేనే.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వస్తాయి. అందుకే ప్రభుత్వం మరింత ఒత్తిడికి గురవుతోంది. మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ఇప్పుడు స్పెషలాఫీసర్ల పాలన సాగుతోంది.