నవతరం దర్శకులకు ఒక్క హిట్ పడగానే, స్టార్ హీరోల నుంచి పిలుపు అందుకొంటున్నారు. కథ, క్యారెక్టరైజేషన్ నచ్చితే చాలు, హీరోలు కూడా దర్శకుల అనుభవాన్ని లెక్కలో తీసుకోకుండా ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కిస్తున్నారు. అయితే… చందూ మొండేటి మాత్రం ఈ పదేళ్లలో 5 సినిమాలు తీసి, ఇద్దరు హీరోలకే పరిమితం అయిపోయాడు. అటు.. నాగచైతన్య, ఇటు నిఖిల్లతోనే సినిమాలు చేసుకొంటూ వచ్చాడు. కార్తికేయ, కార్తికేయ 2 పెద్ద హిట్లు అయినా, స్టార్స్ తో పని చేయలేకపోయాడు. కాకపోతే… అవకాశాలు మాత్రం వచ్చాయి. వాటిని మెటీరియలైజ్ చేసుకోలేకపోయాడంతే.
”కార్తికేయ తరవాత ఎన్టీఆర్ నుంచి పిలుపొచ్చింది. ఓ కథ చెప్పాను. ఆయనకు బాగా నచ్చింది. దాన్ని డవలెప్ చేసే ప్రోసెస్ లో ఎన్టీఆర్ మరో సినిమా హడావుడిలో పడిపోయారు. గీతా ఆర్ట్స్ కు ఓ కథ చెబితే దాన్ని అరవింద్ గారు రామ్ చరణ్‌తో చేద్దామని చెప్పారు. అయితే అప్పటికే చరణ్ ఓ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు. అలా వచ్చిన అవకాశాలు చేజారిపోయాయి. నేను కూడా చైతన్య, సిద్దార్థ్ లతో కంఫర్ట్ జోన్లో పడిపోయాను. అందులోంచి బయటకు రావాలని వుంది. కాకపోతే.. వెంటనే సిద్దార్థ్ తో `కార్తికేయ 3` చేయాలి” అని చెప్పుకొచ్చారు చందూ.
వెంకటేష్, నాగార్జునలతో ఓ మల్టీస్టారర్ చేయాలన్నది చందూ మొండేటి ఆశ. అదో పోలీస్ కథ. స్క్రిప్టు సిద్ధంగానే వుంది. వెంకీ, నాగ్ కలిస్తే.. కాంబినేషన్ పరంగా ఆ క్రేజ్ మామూలుగా వుండదు. మరి ఆ కలయిక చూసే అవకాశం ఎప్పుడు దొరుకుతుందో?