రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలు హాట్ ఫేవరేట్లుగా ఉంటాయి. అవి ఏ విధంగా చూసినా భవిష్యత్లో బంగారంగా మారే ప్రాంతాలు. సామాన్యులు కూడా ఆయా ప్రాంతాల అభివృద్ధిని సహజంగానే ఊహిస్తారు. అలాంటి ఓ ప్రాంతం కంది. కంది అంటే.. ఎక్కువ మందికి హైదరాబాద్ ఐఐటీనే గుర్తుకు వస్తుంది. ఐఐటీ రాక ముందు నుంచీ ఆ ప్రాంతంలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ ఉంది.
హైదరాబాద్ నుంచి ముంబై హైవే మీదుగా సంగారెడ్డికి చేరుకోవడానికి ముందే కంది వస్తుంది. పదేళ్ల కిందట వరకూ అక్కడ గజం ఐదు నుంచి పదివేల రూపాయల్లోపు ఉండేది. ఇప్పుడు అది పాతిక నుంచి ముఫ్ఫై పైనే ఉంటోంది. అనేక మంది చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, బడా వ్యాపారులు కూడా వెంచర్లు వేశారు. ఇళ్ల నిర్మాణాలు కూడా పెరుగుతున్నాయి. కంది గ్రామం పటాన్ చెరు, సంగారెడ్డికి మధ్యలో ఉంటుంది. అక్కడ ఇప్పటికిప్పుడు ఇళ్లు నిర్మించుకున్న విద్యా , వైద్య వంటి సౌకర్యాలకు కొదవేమీ ఉండదు. అందుకే కాలనీల నిర్మాణం పెరుగుతోంది.
ఇండస్ట్రీస్ పరంగా చెప్పాల్సిన పని లేదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పటాన్ చెరు నుంచిసంగారెడ్డి వరకూ పారిశ్రామికీకరణ జరిగింది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ నివాసం ఉంటారు. అందుకే.. డిమాండ్ పెరుగుతోంది. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం ప్రకటన తర్వాత కంది చుట్టుపక్కల రేట్లు మరింత పెరిగాయి. వచ్చే ఐదు లేదా పదేళ్లలోనే కంది ప్రాంతం అభివృద్ది చెందిన జంక్షన్ గా మారిపోతుందని..మరో కూకట్ పల్లి అవుతుందన్న అంచనాలు వస్తున్నాయి.