విశాఖపట్నం శరవేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా బోగాపురం ఎయిర్ పోర్టు మరో ఏడాదిలో ప్రారంభం కానుండటంతో అటు ఉండే గ్రామాలు, కాలనీల్లో లావాదేవీలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది తగరపు వలస. అటు బోగాపురానికి ఇటు విశాఖకు మధ్యలో ఉండే తగరపువలసలో రియల్ వెంచర్లు క్రమంగా పెరుగుతున్నాయి. అపార్టుమెంట్ల నిర్మాణం జోరుగా సాగుతోంది.
ఇక్కడ అపార్టుమెంట్లలో ఎస్ఎఫ్టీ మూడు వేల వరకూ చెబుతున్నారు బిల్డర్లు. ఇతర ఖర్చులు అన్నీ కలుపుకుంటే.. 40 లక్షల లోపునే డబుల్ బెడ్ రూం ఫ్లాట్ లభిస్తోంది. తగరపు వలస.. ఆ చుట్టుపక్కన వందల కొద్దీ అపార్టుమెంట్లు నిర్మితమవుతున్నాయి. ఇవన్నీ డిమాండ్ ను తీరుస్తున్నాయి. ఇండిపెండెంట్ హౌస్లను కూడా చిన్న బిల్డర్లు నిర్మించి అమ్ముతున్నారు. అపార్టుమెంట్లతో పోలిస్తే వీటి ధర కాస్త అధికం అయినా.. అన్ని రకాల సౌకర్యాలతో లభిస్తున్నాయి.
ప్రస్తుతం ఉన్న మార్కెట్ తో పోలిస్తే.. తగరపు వలసలో అందుబాటులోనే ఇళ్లు, స్థలాలు, అపార్టుమెంట్లు లభిస్తున్నాయి. బోగాపురం ఎయిర్ పోర్టు కార్యకలాపాలు పెరిగితే.. తగరపు వలస మరో వాణిజ్య కేంద్రం అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. అందుకే అక్కడ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇక్కడ అమ్మే స్థలాలు, ఇళ్లు, అపార్టుమెంట్లకు వీఎంఆర్డీఏ అనుమతి ఉంటుంది.