ఓ పెద్ద సినిమా ఒక రోజు షూటింగ్ చేసుకొందంటే.. అటూ ఇటుగా కోటి రూపాయల ఖర్చు. రాజమౌళి, శంకర్ లాంటి దర్శకులైతే ఆ ఖర్చు మరో స్థాయిలో ఉంటుంది. అలాంటిది నెల రోజులు షూటింగ్ చేశాక.. ఆ ఫుటేజ్ అంతా చెత్తకుప్పలో పారేస్తే ఎలా ఉంటుంది? నిర్మాతకు ఎన్ని కోట్లు నష్టం? ఆ దర్శకుడి కష్టం ఎంత వృధా అయినట్టు? ఈమధ్య తరచూ కొన్ని పెద్ద సినిమాలు ఎదుర్కొంటున్న సమస్య ఇది. షూటింగ్ జరుపుకొన్న తరవాత రషెష్ చూసుకోవడం, నచ్చకపోతే పక్కన పెట్టేసి, రీషూట్‌కి వెళ్లడం.. ఇలాంటి వ్యవహారాలతో నిర్మాత చేతుల్లోంచి బడ్జెట్ దాటిపోయి, నిలువునా మునిగిపోతున్నాడు. యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ విషయంలో ఇదే జరిగిందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
కేజీఎఫ్‌తో పాపులారిటీ తెచ్చుకొని స్టార్ అయిపోయాడు యశ్. తన తదుపరి సినిమా కోసం చాలా ఆలోచించాడు. చివరికి గీతూ మోహన్ దాస్ చెప్పిన కథని ఓకే చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో వుంది. ఇటీవల యశ్ పుట్టిన రోజు సందర్భంగా ఓ టీజర్ విడుదల చేశారు. కేజీఎఫ్ తరువాత వస్తున్న సినిమా కాబట్టి స్వతహాగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల ముంబైలో నెల రోజుల పాటు ఓ షెడ్యూల్ నిర్వహించారు. తీరా.. ఫుటేజీ చూసుకొంటే హీరోగారికి నచ్చలేదట. దాంతో తీసిన సన్నివేశాలన్నీ మూలన పడేసి, రీషూట్‌కి వెళ్లాల్సివస్తోంది. ఈ నెల రోజుల షెడ్యూల్ వృధా అయినట్టే. ఈ నెల రోజుల షూటింగ్ కోసం ఎంత ఖర్చు పెట్టారో నిర్మాతకే తెలియాలి. పెద్ద సినిమాలతో వచ్చే సమస్యే ఇది. బడ్జెట్లు ఉన్నాయి కదా అని ఎడా పెడా వాడేస్తుంటారు. చివరికి సినిమా హిట్టయిన కూడా నిర్మాత జేబుకు చిల్లే మిగులుతుంది. మరి.. టాక్సిక్ భవిష్యత్తు ఎలా ఉంటుందో?