ఆంధ్రా పాలకుల చేతిలో తెలంగాణా ప్రాంతం, ప్రజలు, సహజవనరులు అన్నీ దోపిడీకి గురవుతున్నాయి కనుక తెలంగాణా రాష్ట్రం ఏర్పడితేనే న్యాయం జరుగుతుందని పోరాడి తెలంగాణా సాధించుకొన్నారు. తెలంగాణా కోసం పోరాడిన తెరాసయే ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పటికీ రాష్ట్రంలో గల పరిశ్రమలలో, ఐటి కంపెనీలలో, వివిధ ఇతర సంస్థలలో తెలంగాణా ప్రజలకి ఉద్యోగాలు లభించడం లేదు. ప్రైవేట్ సంస్థలు నేటికీ స్థానికేతరులకే ప్రాధాన్యత ఇస్తున్నాయని ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. అన్ని సంస్థలలో 80శాతం ఉద్యోగాలు తెలంగాణా స్థానికులకే ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించాలని అయన కోరారు.
తెరాస అధికారంలోకి వచ్చిన కొత్తలో అన్నీ తెలంగాణా ప్రజలకే దక్కాలి అన్నట్లుగా మాట్లాడేది..వ్యవహరించేది. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా నిర్వహించినపుడు స్థానికత అంశంపై చాల చర్చ జరిగింది. కానీ తెరాస ప్రభుత్వం అధికారంలో కుదురుకొన్న తరువాత దాని ఆలోచనలలో, ప్రాధాన్యతలలో చాలా మార్పు వచ్చింది. తెరాస ప్రభుత్వం ఎల్లప్పుడూ ఎన్నికలు, ఓట్లు, అధికారం సుస్థిరం చేసుకోవడం, అందుకోసం ప్రతిపక్ష పార్టీలలో ఫిరాయింపులని ప్రోత్సహించడం గురించే ఎక్కువగా ఆలోచిస్తోందనే విమర్శలు ఎదుర్కొంటోంది.
తెరాసయే రాష్ట్రంలో శాస్వితంగా అధికారంలో ఉండాలనే ఆలోచనతో సిద్దాంతాలని, తన ఆశయాలని, చివరికి తెలంగాణా కోసం పోరాడినవారిని కూడా పక్కనబెట్టి, ఎన్నడూ తెలంగాణా కోసం మాట్లాడని ప్రతిపక్ష పార్టీల నేతలని పార్టీలో చేర్చుకొని వారికే పదవులు కట్టబెట్టడంతో ఇప్పుడు తెరాస స్వరూపమే పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఎవరు రాష్ట్రానికి అన్యాయం చేశారని తెరాస వాదించేదో, ఇప్పుడు మళ్ళీ వారి చేతికే రాష్ట్ర పగ్గాలు అప్పగించిందని విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే తెరాస ప్రభుత్వంలో కూడా ‘స్థానికులకి’ అవకాశం లేకుండా పోయిందని స్పష్టం అవుతోంది.
ఇక తెలంగాణా అభివృద్ధి పేరిట రాష్ట్రంలో జరుగుతున్న నిర్మాణ పనులలో కూడా ఆంధ్రాకి చెందిన కాంట్రాక్టర్లకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. సహజంగానే వారి సంస్థలలో ఆంధ్రావారికే ఉద్యోగాలలో ప్రాధాన్యత ఉంటే ఆశ్చర్యమేమీ లేదు. తెలుగు సినిమా రంగం మొదటి నుంచి ఆంధ్రాప్రాంతం వారి చేతిలోనే ఉంది కనుక దానిలోనూ ఆంధ్రావారికే ప్రాధాన్యత దక్కడం సహజమే. తెలంగాణాకి చెందిన జూనియర్ ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు, ఇంకా వివిధ శాఖలకి చెందినవారు తమకి అన్యాయం జరుగుతోందని ఈ రెండేళ్లలో చాలాసార్లు రోడ్డెక్కిన సంగతి అందరికీ తెలిసిందే. ఉన్నత విద్యా, వైద్య, పారిశ్రామిక, వ్యాపార తదితర రంగాలు కూడా నేటికీ చాలా వరకు ఆంధ్రావారివే ఉన్నాయి. కనుక అక్కడా స్థానికులకి ప్రాధాన్యత తక్కువే ఉంటుందని చెప్పకతప్పదు. చివరికి తెలంగాణా న్యాయవ్యవస్థలో కూడా ఆంధ్రావారికే ప్రాధాన్యత ఇవ్వడంతో తెలంగాణా న్యాయవాదులు న్యాయం కోరుతూ రోడ్డెక్కడం అందరూ చూస్తూనే ఉన్నారు.
అంటే అటు ప్రభుత్వంలోను, ప్రైవేట్ సంస్థలలో కూడా స్థానికులకి అవకాశాలు దక్కడం లేదని స్పష్టం అవుతోంది. అంటే తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటికీ పరిస్థితులలో పెద్దగా మార్పు ఏమీ రాలేదని స్పష్టం అవుతోంది. దానినే ప్రొఫెసర్ కోదండరాం ప్రశ్నిస్తున్నారు.