పెద్దరికం నిలుపుకోవాలంటే పెద్దన్నలా బాధ్యతగా ఉండాలి. చిన్న బుద్దులతో సొంత కాళ్లను నరికేసుకుంటానంటే పెద్దరికం పోయి.. శత్రువు ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సి వస్తుంది. అగ్రరాజ్యానికి కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి పరిస్థితి తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తీసుకుంటున్న్ నిర్ణయాలు అమెరికాను చులకన చేస్తున్నాయి. అదే సమయంలో అమెరికా అద్భుతమైన పని తీరుతో ప్రపంచాన్ని శాంసించే దిశగా అడుగులు వేస్తోంది. చైనా వ్యూహాలను అర్థం చేసుకునే పరిస్థితుల్లోనే ట్రంప్.. మెల్లగా అగ్రరాజ్య హోదాను చైనా చేతికి అందిస్తున్నారు. అంతర్జాతీయ ఒప్పందాల నుంచి వైదొలగడం.. ఇతర దేశాలపై పన్నులు వేస్తానని చెప్పడం. .మిత్ర దేశాలను ఆక్రమిస్తానని రెచ్చిపోవడం.. సొంత దేశంలో నిరుద్యోగాన్ని పెంచే చర్యలు చేపట్టడమే కాదు.. తమ దేశానికి మేధో వలస రాకుండా చేయాలని నిర్ణయించుకున్నారు. తమ దేశానికి వచ్చి కొంత మంది సంపాదిచుకుంటున్నారని కుళ్లుకుంటున్నారు కానీ.. తమ దేశానికి ఎంత సంపాదించి పెడుతున్నారో ఆయన ఆలోచించడం లేదు. ఇవన్నీ కలిసి ఆమెరికాను దిగువ స్థాయి దేశంగా మార్చడం ఖాయంగా కనిపిస్తోంది.
ట్రంప్ తీసుకున్నవన్నీ తిరోగమన నిర్ణయాలే
అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దాదాపుగా వంద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. ఎక్కడ ప్రమాణ స్వీకారం చేశారో అక్కడే సంతకాలు పెట్టారు. దేశానికి సంబంధించిన వాటితో పాటు తన కోసం జైలుకు వెళ్లిన అభిమానులను వదిలేయడం వరకూ చాలా నిర్ణయాలు ఉన్నాయి. మెక్సికో నుంచి అక్రమ వలసలను అడ్డుకునేందుకు అమెరికా దక్షిణ సరిహద్దుల్లో నేషనల్ ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ప్రకటించారు. జో బైడెన్ హయాంలో తీసుకున్న 78 నిర్ణయాలను రద్దు చేస్తూ ట్రంప్ సంతకం చేశారు. అమెరికాలో పుట్టిన వారికి అమెరికా పౌరసత్వం వస్తుందనే హక్కును కూడా మార్పు చేశారు. పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలుగుతున్నట్టు ట్రంప్ ప్రకటించారు. విచిత్రంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి కూడా వైదొలగాలని ట్రంప్ నిర్ణయించారు. ఈ ఫైళ్లపై సంతకాలు పూర్తయ్యాక.. ఆ పెన్నులను జనంలోకి విసిరేశారు. అక్కడే ఆయన ఎంత అనాలోచితంగా ఉన్నారో.. దేశం పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అందరికీ అర్థమైపోయింది. ఆయన తీసుకున్న సగం నిర్ణయాలు రాజ్యాంగపరంగా చెల్లవు. చెల్లే నిర్ణయాలు అమెరికాకు పెను సమస్యలు సృష్టించబోతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలుగుతామని ఆయన చేసిన సంతకంతో.. పెద్దన్న కాస్త చిన్నబుచ్చుకుపోయారు. ఐక్యరాజ్య సమితికి చెందిన విభాగం అయిన ప్రపంచ ఆరోగ్య సంస్థకు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంబంధిత కార్యక్రమాలలో భాగస్వామ్యం ఉంది. బైడెన్ పాలనలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు అత్యంత ఎక్కువ నిధులు ఇచ్చింది అమెరికానే. 2023లో దాదాపు ఐదో వంతు సంస్థ బడ్జెట్ కు అమెరికా నిధులు సమకూర్చింది. ఇలా చేయడం ద్వారా అమెరికా తన బాధ్యతను నిర్వర్తించతడంతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థపై పట్టు కూడా సాధించినట్లవుతుంది. కానీ అదో దండగ ఖర్చు అని వైదొలుగుతామని ప్రకటించారు. ట్రంప్ నిర్ణయం వల్ల అమెరికాకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు కేటాయించాల్సిన నిధులు మిగులుతాయి.కానీ ప్రపంచ పెద్దన్న పాత్రను క్రమంగా కోల్పోవడానికి కారణం అవుతుంది. ఈ సంస్థలో చైనా తన పట్టు పెంచుకోవడానికి మరిన్ని నిధులు ఇస్తుంది. దాని వల్ల అమెరికా పలుకుబడి తగ్గిపోతుంది. ట్రంప్ నిర్ణయం విపత్తు లాంటిది. డబ్ల్యూహెచ్ఓను వీడాలనే అమెరికా నిర్ణయం ప్రపంచ ఆరోగ్యానికే గట్టి దెబ్బ. అమెరికాకు మరింత పెద్ద గాయం అని చెప్పక తప్పదు.
దేశాలపై పన్నులు పెంచితే అమెరికాకే నష్టం !
అగ్రరాజ్యాధినేత.. తమది అగ్రరాజ్యమన్న భావనలో ఉండాలి.కానీ ఆయన కెన్యాతో కూడా అమెరికాను పోల్చుకుంటారు. బ్రెజిల్ తోనూ పోల్చుకుంటారు. చివరికి కెనడాతోనూ పోల్చుకుంటారు. తమ దేశం నుంచి వచ్చే ఉత్పత్తులకు ఎక్కువ పన్ను వేస్తున్నారని అదే ఆయా దేశాల నుంచి తమ దేశంలోకి వచ్చే వాటికి తక్కువ పన్నులేస్తున్నామని ఆయన వాదిస్తున్నారు. అందుకే తాము కూడా పన్నులు పెంచుతామని అంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఏమనుకుంటున్నారో కానీ ఆయన దిగుమతులపై పన్నులు పెంచితే.. ఎగుమతులపై పన్నులు పెంచితే నష్టపోయేది అమెరికా సమాజమే. కాసినోలు.. క్లబ్బుల వ్యాపారం తప్ప… ఉత్పాదక పరిశ్రమలు పెట్టని ట్రంప్ కు ఈ అంశంపై అవగాహన లేదేమో కానీ.. అమెరికా మార్కెట్ కు ప్రత్యామ్నాయాన్ని ఆయా దేశాలు చూసుకుంటే.. అమెరికా ఎంత నష్టపోతుందో చెప్పాల్సిన పని లేదు. అమెరికా ఆదాయం పెరగాలంటే.. ఉత్పాదకత పెంచుకోవాలి కానీ పన్నులు పెంచి వాటికి డిమాండ్ లేకుండా చేసుకుంటామంటే ఎలా ఉంటుంది?. అమెరికన్లకు ఆదాయపు పన్ను లేకుండా చేస్తానని అంటున్నారు. ఆయన ఇదే పద్దతిలో వెళ్తే ఆదాయపు పన్ను కట్టేంత ఆదాయం ఉన్న వారి సంఖ్య అమెరికన్లలో తగ్గిపోవడం ఖాయమని అనుకోవచ్చు. చివరికి ఆయన ప్రభుత్వ ఉద్యోగులపైనా పడ్డారు. ఎనిమిది నెలల జీతం ఇస్తాం అందరూ మానేసేయండి అని మెసెజ్ పెట్టారు. ప్రభుత్వ సమర్థత ఉద్యోగుల పని తీరు మీదే ఆధారపడి ఉంటుంది. వారు సరిగ్గా పని చేయకపోతే …సరైన మ్యాన్ పవర్ లేకపోతే అమెరికా ప్రభుత్వం నిస్తేజమవుతుంది. రేపు కొత్తవారిని తీసుకున్నా వారికి శిక్షణ ఇచ్చేటప్పటికి జరాగల్సిన నష్టం జరిగిపోవచ్చు. అమెరికాలో నివాసం ఉంటున్న అక్రమ వలసదారుల్ని గెంటేస్తే మంచిదే కానీ.. అసలు లీగల్‌గా వచ్చేవారిని కూడా రాకుండా కట్టడి చేస్తామని అంటే అంత కంటే పిచ్చి పని ఉండదు. ఎలాన్ మస్క్ అమెరికాకు వచ్చి ఎంత సంపద సృష్టించాడో కళ్లముందే ఉంది. ఆయన మొదట విద్యార్థి వీసా ద్వారానే వచ్చాడు. అలాంటి వారిని రాకుండా చేస్తానంటే నష్టపోయేది ఎవరు ?. ఆయన దక్షిణాఫ్రికాలోనో.. కెనడాలోనే ఉండి ఉంటే… టెస్లాకు అక్కడే రూపకల్పన చేసి ఉండేవాడు. ఇలాంటివి ఆలోచించే పరిస్థితుల్లో ట్రంప్ లేరని మనకు సులువుగానే అర్థమవుతుంది.
సైలెంట్ గా అన్ని రంగాల్లోనూ అమెరికాను దాటిపోతున్న చైనా
ట్రంప్ ఇలా అధికారం చేపట్టగానే చైనా కొట్టిన దెబ్బకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. డీప్ సీక్ ఆవిష్కరించడంతో అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. అమెరికా సున్నితమైన సంపదను సృష్టించుకుంది. అంటే టెక్ పునాదుల మీద నిలబడిన ఆర్థిక సామ్రాజ్యం. మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా లాంటివే అమెరికా ఆస్తులు. అలాంటివాటిని కుప్పకూల్చడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే వాటికి మించిన ప్రోడక్టులు మార్కెట్లోకి తెస్తే చాలు అవి కప్పుకూలిపోతాయి. దానికి సాక్ష్యం డీప్‌సీక్. చాట్ జీపీటీని బీట్ చేసేలా డీప్ సీక్ ను చైనా డెలవప్ చేసి రిలీజ్ చేసింది. అది ప్రపంచాన్ని ఇట్టే ఆకట్టుకుంది. అంతే అమెరికా స్టాక్ మార్కెట్లలో రక్తపాతం చోటు చేసుకుంది. ఎప్పటికి కోలుకుంటుందో తెలియదు కానీ.. అమెరికాపై ఇలాంటి అణుబాంబులు వేయడానికి చైనా చాలా కాలంగా ఎన్నో ఆయుధాలు రెడీ చేసుకుంటోంది. అమెరికాకు చెందిన ఒక్కటంటే ఒక్క సోషల్ మీడియా చైనాలో ఉండదు. కానీ అమెరికాను దెబ్బకొట్టే టెక్నాలజీని చైనా డెలవప్ చేసుకుంటోంది. డీప్ సీక్ మాత్రమే కాదు చైనా టెక్నాలజీ అమెరికాను బీట్ చేసేలా దూసుకెళ్తోంది. అయితే చైనా టెక్నాలజీ.. ఇలా డిజిటల్ లో మాత్రమే ఉండదు. తయారీ రంగంలో.. ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లేలా ఉంటుది. చైనా సూర్యుడికి ప్రత్యామ్నాయంగా మరో సూర్యుడిని తయారు చేస్తుందంటే ఎవరైనా నమ్మగలరా ?. ఇది నిజం. అలాగే ఆరో తరం ఫైటర్ జెట్స్‌ను కూడా చైనా రెడీ చేసుకుంది. ధ్వని కన్నా నాలుగు రెట్ల వేగంతో దూసుకుపోయే బూమ్ సూపర్ సోనిక్ విమానాలను.. వాణిజ్య పరంగా ఆపరేట్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. బీజింగ్ నగరం మొత్తానికి కరెంట్ ఇచ్చేందుకు.. అతి పెద్ద సోలార్ వాల్ నిర్మిస్తోంది. ఈ వాల్ ఐదు కిలోమీటర్ల వెడల్పుతో.. వందల కిలోమీటర్ల పొడవు ఉంటుందని చెబుతున్నారు. బీజింగ్ మహానగరానికి పూర్తిగా సోలార్ ద్వారానే కరెంట్ ఇవ్వబోతున్నారు. బ్రహ్మపుత్ర నదిపై అతి పెద్ద డ్యామ్ కట్టబోతున్నారు. చైనాలో బుల్లెట్ రైళ్లు ఊరూవాడా పరుగులు పెడుతూ ఉంటాయి. చైనా తయారీ రంగానికి అధిపతి. కరోనా తర్వాత ఆ దేశం నుంచి ప్లాంట్లను ఇతర దేశాలకు తరలిస్తారన్న ప్రచారం జరిగింది కానీ.. పెరుగుతున్న డిమాండ్ కోసమే ఇతర దేశాల్లో యాపిల్ వంటి సంస్థలు ప్లాంట్లు పెడుతున్నాయి కానీ.. చైనాలో అమ్ముకోవడానికి కాదు. అమెరికా ఇదే రకంగా వ్యవహరిస్తే చైనా తయారీ రంగంలోనే కాదు.. టెక్ ప్రపంచంలోనూ మరో అడుగు ముందకేస్తుంది. అమెరికా వెనుకబడుతోంది.
ప్రపంచ దేశాలపై పట్టు పెంచుకుంటున్న చైనా
అమెరికాను పెద్దన్నగా .. ప్రపంచం అంతా గుర్తించడానికి కారణం .. పెద్దన్నగా వ్యవహిరంచడమే. ఇతర దేశాలను ఆపద వచ్చినప్పుడు ఆదుకోవడం దగ్గర నుంచి చైనా, రష్యాతో పాటు ఇతర దేశాల నుంచి ఏదైనా ముప్పు వస్తే తాము ఉన్నామని ముందుకు రావడం, ఉగ్రవాదంపై పోరాటానికి సిద్ధంగా ఉండటం వల్ల ఈ పెద్దన్న హోదా ఉంది. ఈ కారణంగానే అమెరికా డాలర్ ప్రపంచ కరెన్సీగా కొనసాగుతోంది. అమెరికాతో అవసరాలు ప్రపంచదేశాలకు తీరిపోతే ఇక డాలర్ అవసరం వారికి ఉండదు. చైనా కూడా వ్యూహాత్మకంగా డాలర్ ను దాటిపోయేందుకు ప్రయత్నిస్తోంది. అనేక దేశాలపై తమ ముద్ర ఉండేలా చూసుకుంటుంది. చైనా సిల్క్ రోడ్ ప్రాజెక్టు ద్వారా ఎన్నో దేశాలకు ఆర్థిక సాయం చేస్తూ.. ఆయా దేశాల్లో తన పట్టు పెంచుకుంది. ఇప్పుడు శ్రీలంక నుంచి యూరప్ లోని జర్మనీ వరకూ చైనాను పెద్దన్నగా గుర్తించాల్సిన అవసరాన్ని కల్పించింది. చైనా పన్నిన రుణ ట్రాప్‌లో కనీసం పాతిక దేశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఆ దేశాలన్నీ చైనా చెప్పినట్లుగా చేయాల్సిందే. అయితే చైనా ఇంకా తనకు అలాంటి పెత్తనం కావాలని ప్రయత్నించడం లేదు. చైనాకు ఇంకా భారీ లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్యాలను అందుకునేలా ట్రంప్ పాలనా తీరు ఉంటుంది.
డొనాల్డ్ ట్రంప్ అందరూ తమ డాలర్లు తింటున్నారని.. అనుకుంటున్నారు కానీ.. వారు తమకు సంపాదించి పెడుతున్నారని అనుకోవడం లేదు. సంపాదించి పెడుతున్నది చూసుకోవడం లేదు. తింటున్నారన్నదే చూస్తున్నారు. ఇప్పుడు ఆ తిండి లాగేస్తే.. అమెరికాకు ఆ సంపాదన కూడా తగ్గిపోతుంది. అగ్రరాజ్యం అనే హోదాను అందుకుని ప్రపంచంపై పెత్తనం చేయాలనుకుంటున్న చైనా.. డొనాల్డ్ ట్రంప్ అద్భుతమైన అవకాశాన్ని ఇస్తున్నారు. ఇది ఒక్క అమెరికాకే నష్టం చేయదు.. మొత్తం ప్రపంచాన్ని రిస్క్ లో పెడుతుంది.