ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనం కట్టాలని ఏళ్లుగా అనుకుంటున్నారు. కానీ ఏ ప్రభుత్వమూ కట్టలేపోయింది. రేవంత్ మాత్రం తన ప్రభుత్వంలో కట్టి తీరాలన్న లక్ష్యంతో ఉన్నారు. ఉస్మానియా ఆస్పత్రి ప్రస్తుతం ఉన్న భవనం స్థానంలో నిర్మాణం చేయడం సాధ్యం కాదని.. పెరిగిపోయిన అవసరాలకు సరిపోదని గుర్తించడంతో.. సమీపంలోని గోషామహల్ స్టేడియంలోఆస్పత్రిలో నిర్మించాలని నిర్ణయించారు. గోషామహల్ స్టేడియం పోలీసు స్టేడియంగా ప్రసిద్ది చెందింది. అక్కడ పెద్దగా క్రీడా కార్యక్రమాలు జరగడంలేదు. ప్రజల వాకింగ్ కు… ఉపయోగపడుతోంది.
ఇప్పుడు ఆ స్టేడియంలో అందరికీ ఉపయోగపడేలా భారీ ఆస్పత్రిని నిర్మించాలని నిర్ణయించారు. అత్యాధునిక వసరతులతో రెండున్నర వేల కోట్లు ఖర్చు పెట్టి ఉస్మానియా అత్యాధునిక ఆస్పత్రికి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు. వీలైనంత త్వరగా నిర్మించి.. ఆధునిక వసతులతో పేదలకు అందుబాటులోకి వైద్యం తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఉన్న ఉస్మానియా ఆస్పత్రి దశాబ్దాలుగా అంతే ఉంది. పెరుగుతున్నది లేదు.. పెంచుతున్నది లేదు కానీ.. రోగుల సంఖ్య మాత్రం పట్టనంతగా ఉంటోంది.
కేసీఆర్ కొత్త ఉస్మానియా ఆస్పత్రి కోసం ప్లాన్ చేశారు కానీ.. చిన్న సమస్యలు రాగానే పక్కన పడేశారు. కానీ సచివాలయాన్ని మాత్రం శరవేగంగా పూర్తి చేశారు. అప్పట్లోనే కేసీఆర్ పై విమర్శలు వచ్చాయి. రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉస్మానియాకు కొత్త ఆస్పత్రి భవనాలు ఉండాల్సిందేనని పలు రకాలుగా పరిశీలించి.. గోషామహల్ స్టేడియాన్ని ఖరారు చేశారు. మజ్లిస్ కూడా అభ్యంతరం చెప్పలేదు. దాంతో ఆస్పత్రి నిర్మాణం ప్రారంభం కానుంది.