కర్నూలుకు హైకోర్టు బెంచ్ ను మాటలకే పరిమితం చేయకుండా.. ఏడాదిలో నిజం చేసేందుకు కూటమి ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా బెంచ్ ఏర్పాటుకు కావాల్సిన సౌకర్యాలపై నివేదిక రెడీ చేస్తోంది. అందుబాటులో ఉన్న భవనాలు.. హైకోర్టు బెంచ్ కోసం శాశ్వతంగా కట్టాల్సిన భవనం, స్థల సేకరణ కోసం విస్తృతంగా అధికారులు పరిశీలన చేస్తున్నారు.
బెంచ్ ఏర్పాటు చేస్తే మొత్తం 15మంది హైకోర్టు న్యాయమూర్తులు ఉంటారు. అందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలపై. వివరాల కోసం హైకోర్టు రిజిస్ట్రార్ కలెక్టర్కు లేఖ రాశారు. దీంతో అధికారులు స్థలపరిశీలన.. భవనాల పరిశీలన చేసి వివరాలు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కర్నూలులో బెంచ్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు ప్రజాగళం సభలో చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. గత నవంబరులో అసెంబ్లీలో తీర్మానం చేశారు. బెంచ్ ఏర్పాటు కోసం తక్షణ చర్యలు మొదలుపెట్టాలని కోరుతూ, హైకోర్టుకు లేఖ రాశారు.
బెంచ్ ఏర్పాటు హైకోర్టు ద్వారానే జరగాలి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి థీరజ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాుట అయింది. అ కమిటీ ముందు మౌలిక సదుపాయాల వివరాలు ఉంచుతారు. తర్వాత ప్రభుత్వం కల్పించే సౌకర్యాల వివరాలు కలిపి సుప్రీంకోర్టుకు నివేదిక పంపుతారు. అన్నీ ఏడాదిలోపు పూర్తి చేసి..కర్నూలులో బెంచ్ ఏర్పాటు పూర్తి చేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది.