మా సోషల్ మీడియా కాస్త బలహీనంగా ఉంది.. బలోపేతం చేసుకుంటామని.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. రేవంత్ పాలనపై ఒపీనియన్ పోల్ పెట్టడం అందులో బీఆర్ఎస్ తన మార్క్ ను చూపించడంతో కాంగ్రెస్ నేతలకు షాక్ తగిలినట్లయింది. బీఆర్ఎస్ డబ్బులు పెట్టి మ్యానిప్యులేట్ చేస్తుందని నిరూపించడానికే పోల్ పెట్టామని కవర్ చేసుకున్నా జరగాల్సినా నష్టం జరిగిపోయింది.
రాజకీయాల్లో సోషల్ మీడియా పవర్ గురించి చెప్పాల్సిన పని లేదు. అందుకే కేటీఆర్ తన పార్టీకి పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో హైప్ ఇచ్చేందుకు పెద్ద సైన్యం ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ అయితే కేసులు, గొడవలు ఉంటాయని దుబాయ్, అమెరికా వంటి చోట్ల నుంచి ఆపరేట్ చేసేలా చూసుకున్నారని అంటారు. పార్టీ సానుభూతిపరులు ఇతర దేశాల్లో ఉంటే వారికి ప్రోత్సాహం ఇస్తున్నారు. టెక్నికల్ గా పెయిడ్ అయినా సరే బాట్స్ ను ఉపయోగించి.. తమదే పైచేయి అనిపించేలా చేసుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీం బలహీనం ఉందన్నది మొదటి నుంచి ఉన్న ప్రచారం. సునీల్ కనుగోలు తీసుకున్నారో లేదో తెలియదు కానీ.. పార్టీ యంత్రాంగాన్ని సమర్థంగా వాడుకోవడంలో మాత్రం విఫలమవుతున్నారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కోసం టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలే కష్టపడ్డారు. తర్వాత వారు పట్టించుకోవడం మానేశారు. ఆ మూమెంట్ ను అందుకోవడానికి కాంగ్రెస్ సోషల్ మీడియాకు చేతకావడం లేదు. కేవలం డబ్బు పెట్టి సోషల్ మీడియాను నడిపించలేరని.. సానుభూతిపరుల్ని యాక్టివేట్ చేసుకునే యంత్రాంగం ఉండాలని నిపుణులు సలహాలిస్తున్నారు. ఆ దిశగా కాంగ్రెస్ ఎలాంటి ప్రయత్నం చేస్తుందో మరి !