madha gaja raja movie review
‘ఆలస్యం అమృతం విషం’ అంటుంటారు పెద్దలు. సినిమాల విషయంలో ఇది నూటికి నూరు పాళ్లు నిజం. ఓ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతున్న కొద్దీ దానిపై ఆసక్తి పోతుంది. యేళ్ల తరబడి విడుదల వాయిదా వేసుకొంటూ వచ్చిన సినిమాలు ఆడిన దాఖలాలు లేవు. రోజు రోజుకీ సినిమా రూపు రేఖలు మారిపోతున్న నేపథ్యంలో 12 సంవత్సరాల క్రితం పూర్తయిన ఓ సినిమా వచ్చిందంటే దానిపై ఆసక్తి ఏముంటుంది? కానీ అనూహ్యంగా ఇలాంటి సినిమా ఒకటి తమిళనాట రూ.50 కోట్లు కొల్లగొట్టింది. అదే ‘మదగజరాజా’. విశాల్ నటించిన ఈ చిత్రానికి సి.సుందర్ దర్శకుడు. ఓల్డ్ వైన్‌లా అంతలా కిక్ ఇచ్చిన మేటర్ ఈ సినిమాలో ఏముంది? తమిళంలో ఘన విజయాన్ని అందుకొన్న ఈ చిత్రం… తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా వుందా?
ఎంజీఆర్ (విశాల్) అరకులో కేబుల్ ఆపరేటర్. తనని అందరూ రాజా అని పిలుస్తుంటారు. తన చుట్టూ ఉన్నవాళ్లు సంతోషంగా ఉండాలని కోరుకొనే మనస్తత్వం. తండ్రి ఎస్.ఐ. అయితే తండ్రి చేయాల్సిన పనులు కూడా తానే చేసేస్తుంటాడు. ఆ క్రమంలోనే అగ్గిపుల్ల ఆంజనేయులు అనే ఓ నేరస్థుడ్ని, అతని కూతురు మాధవి (అంజలి)ని ఇలానే కాపాడతాడు. ఆ తరవాత మాధవి – రాజా ప్రేమలో పడిపోతారు. స్కూల్ మాస్టారు ఇంట్లో పెళ్లికని పక్క ఊరు వెళ్తాడు రాజా. ఈ పెళ్లికి తన చిననాటి స్నేహితులు కూడా వస్తారు. అయితే ఒకొక్కరిదీ ఒక్కో సమస్య. ఆ సమస్యలన్నీ తన భుజాన వేసుకొని పరిష్కరిస్తుంటాడు. అందులో భాగంగా కాకర్ల విశ్వనాథ్ (సోనూసూద్)తో తలపడాల్సివస్తుంది. కాకర్ల విశ్వనాథ్ మామూలు వాడు కాదు. రాష్ట్ర రాజకీయాలనే ప్రభావితం చేయగల సమర్థుడు. అతని చేతుల్లో మీడియా, మనీ, మినస్ట్రీ ఉంటాయి. వాటన్నింటినీ ఒకొక్కటిగా దూరం చేస్తానని శపథం పూనుతాడు రాజా. మరి ఆ తరవాత ఏమైంది? రాజా స్నేహితులకు కాకర్ల విశ్వనాథ్ చేసిన అన్యాయం ఏమిటి? ఇవన్నీ తెరపై చూసి తెలుసుకోవాల్సిన అంశాలు.
12 ఏళ్ల క్రితం తయారైన సినిమా ఇది. అంటే ఇప్పటికి అవుట్ డేటెడ్ ఐడియా అన్నమాట. ఈ సినిమా 12 ఏళ్ల క్రితం విడుదలైనా అదే ఫీలింగ్ వస్తుంది. దాన్ని బట్టి కథ, కథనాల విషయంలో సుందర్ సి కొత్తగా ఆలోచించిందేం లేదన్నది అర్థం అవుతుంది. టేకింగ్, క్వాలిటీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకొంటే అంత మంచిది. కాకపోతే… ఇందులో వర్కవుట్ అయిన విషయం ఏమైనా ఉందీ అంటే.. అది కామెడీ అనుకోవాలి. సంతానం ఇప్పుడు సీరియస్ రోల్స్ కి షిఫ్ట్ అయిపోయాడు. తన నుంచి కామెడీ వేషాలు, సినిమాలూ రావడం లేదు. ఇలాంటి దశలో… ఈ సినిమా కాస్త వింటేజ్ సంతానాన్ని గుర్తు చేస్తుంది. సంతానం కామెడీ లో ఉండే స్పెషాలిటీ ఏమిటంటే.. ప్రతీ డైలాగులోనూ ఓ పోలిక ఉంటుంది. ఆ పోలికలు… థియేటర్లో నవ్వు తెప్పిస్తుంటాయి. అలా.. ఈ సినిమాలో ఆద్యంతం సంతానం తనదైన టైమింగ్ తో నవ్వులు పంచుతుంటాడు. చివర్లో మనోబాల చేసిన శవం కామెడీ కాస్త అతిగా అనిపించినా, లాజిక్కు దూరంగా ఉన్నా – అది కూడా థియేటర్లో ఎనర్జీ నింపుతుంది. ఈ రెండు విషయాలూ `మదగజరాజా`ని తమిళనాట విజయాన్ని అందించి ఉంటాయి. తెలుగులో అవి ఎంత వరకూ వర్కవుట్ అవుతాయన్నదే సందేహం.
హీరో ఉత్తముడు. అతని స్నేహితులకు సమస్యలు ఉంటే ఒకొక్కటీగా చక్కబెట్టుకొంటూ వస్తాడు. ఇదే ఈ సినిమా కథ. ముందు మాస్టారు ఇంట్లో సమస్య తీరుస్తాడు. ఆ తరవాత విడాకులు తీసుకోబోతున్న తన స్నేహితుడ్నీ, అతని భార్యనీ కలుపుతాడు. ఆ తరవాత మరో ఇద్దరు స్నేహితులు కూడా సమస్యల్లో ఉన్నారని తెలుస్తుంది. అక్కడ ఇంట్రవెల్ కార్డ్. ఆ సమస్యని ఎలా పరిష్కరించాడన్నది సెకండాఫ్‌లో తేలుతుంది. సినిమా కథంతా ఇంతే. బిట్లు బిట్లుగా సన్నివేశాలు వచ్చిపోతుంటాయి. ఒక ఎపిసోడ్ కీ మరోదానికీ సంబంధం ఉండదు. కాకపోతే.. అక్కడక్కడ సంతానం కామెడీ వర్కవుట్ అవుతూ వెళ్లడంతో పెద్దగా వంక పెట్టడానికి ఏం ఉండదు. చివర్లో శవం కామెడీ ఇటీవల విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ని గుర్తు తెస్తుంది. అందులో కూడా ఈ టైపులో ఓ ఎపిసోడ్ ఉంటుంది. కాకపోతే మదగజరాజాలో ఆ ఎపిసోడ్ ని వీలైనంత సాగదీశారు. వర్కవుట్ అయ్యింది కూడా.
విశాల్ హుషారుగా చేశాడు. చివర్లో సిక్స్ ప్యాక్ కూడా చూపించాడు. సోనూసూద్ ని సరిగా వాడుకోలేదు. ఫస్టాఫ్‌లో సంతానం, చివర్లో మనోబాల ఈ సినిమాని ఆదుకొన్నారు. వాళ్ల టైమింగ్ ఈ సినిమాకు శ్రీరామరక్ష.సుందర్ సి.. లాజిక్కుల్ని ఏమాత్రం పట్టించుకోలేదు. హీరో ఏం అనుకొంటూ అది చేసుకొంటూ వెళ్లిపోతాడంతే. ‘నేను సీబీఐ’ అని చెప్పి విలన్ ఇంట్లో అడుగు పెట్టడం, అంత పెద్ద విలన్ కూడా హీరో వేసే ఎత్తులకు చిత్తయిపోవడం మరీ సినిమాటిక్‌గా ఉంటాయి. ఇద్దరు హీరోయిన్లూ కేవలం గ్లామర్ కోసమే. 12 ఏళ్ల నాటి సినిమా ఇది. అప్పటికీ ఇప్పటికీ అంజలి, వరలక్ష్మిల రూపు రేఖలు, వాళ్లకున్న ఇమేజ్లే మారిపోయాయి. సినిమాల నుంచి దాదాపుగా రిటైర్మెంట్ తీసుకొన్న సదా ఈ సినిమాలో ఐటెమ్ పాట చేసింది. ఓరకంగా వాళ్ల యవ్వన జ్ఞాపకాల ఆల్బమ్ లాంటి సినిమా ఇది. కొన్ని డైలాగులు మరీ శ్రుతిమించినట్టు అనిపిస్తాయి. చాలా చోట్ల బీప్‌లు పడ్డాయి. పాటల్లో బీట్ బాగున్నా, సాహిత్యం సిల్లీగా అనిపిస్తుంటుంది. ముఖ్యంగా విశాల్ పాడిన పాటలో అయితే ప్రాసలు మరీ ఎక్కువయ్యాయి. తెలుగు నటీనటులు చాలామంది ఉన్నా, వాళ్లకు వేరేవాళ్లతో డబ్బింగ్ చెప్పించడం వల్ల అతకలేదు.