రాజకీయ సన్యాసం తీసుకున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్తానని కోర్టులో దాఖలు చేసుకున్న పిటిషన్ కు కోర్టు అనుమతి ఇచ్చింది. నెల రోజుల పాటు నార్వే, ఫ్రాన్స్ లో సేదదీరి వస్తానని ఆయన సీబీఐ కోర్టును పర్మిషన్ అడిగారు. సీబీఐ అసలు పర్మిషన్ ఇవ్వవొద్దని వాదించింది. అయితే కోర్టు పదిహేను రోజులు పర్మిషన్ ఇచ్చింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10లోపు 15 రోజుల పాటు..ఎప్పుడైనా విదేశీపర్యటనకు వెళ్లొచ్చని చెప్పింది. దీంతో వజియసాయిరెడ్డికి ఊరట లభించనుంది. అక్కడ ఆయన ఏం పనులు చక్కబెట్టాలనుకుంటున్నారో కానీ.. ఆయన విదేశీ పర్యటనకు వెళ్లడం ఇప్పటికీ క్లిష్టమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ప్రస్తుతం విజయసాయిరెడ్డిపై ఉన్న అక్రమాస్తుల కేసుల్లోనే కోర్టు అనుమతి ఇచ్చింది. విజయసాయిరెడ్డిపై కాకినాడ పోర్టు వ్యవహారానికి సంబంధించి సీఐడీ, ఈడీ కేసులు కూడా నమోదు అయ్యాయి. ఈ కేసు విషయలో సీఐడీ ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఆయన ఈడీ విచారణకు కూడా ఓ సారి హాజరయ్యారు. లుకౌట్ నోటీసులు జారీ చేశారని తెలిసి చంద్రబాబుపై విజయసాయిరెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ లుకౌట్ నోటీసులు ఇంకా కొనసాగుతున్నాయి.
ఇప్పుడు ఆయన విదేశాలకు వెళ్లాలంటే.. సీఐడీ కూడా అనుమతి ఇవ్వాలి. లుకౌట్ నోటీసులు ఉపసంహరించుకుంటే ఆయన విదేశాలకు వెళ్లవచ్చు. ఇటీవల పోర్టును మళ్లీ అసలు యజమాని కేవీరావుకు ఇచ్చి రాజీ చేసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయనపై లుకౌట్ నోటీసులు ఎత్తేస్తారా లేదా అన్న దానిపైనే ఆయన విదేశీ పర్యటన ఉండే అవకాశం ఉంది.