ఈరోజుల్లో సినిమాని ఓ ప్యాకేజీగా ఇవ్వాల్సిందే. అందులోనే అన్ని రకాల ఎమోషన్స్ మిక్స్ చేయాలి. అప్పుడే రీచబులిటీ ఎక్కువగా ఉంటుంది. ‘తండేల్’ విషయంలోనూ అలాంటి జాగ్రత్తలు తీసుకొందట చిత్రబృందం. టీజర్, ట్రైలర్లలో ఈ సినిమాలోని ఎమోషన్ కంటెంట్ ఎక్కువగా కనిపిస్తోంది. వినోదానికి, లాఫింగ్ కీ పెద్దగా స్కోప్ లేని కథ ఇది. సినిమా అంతా చూసుకొన్న తరవాత… ఎక్కడో మరీ సీరియస్గా సినిమా సాగుతుందన్న ఫీలింగ్ కలిగిందట చిత్రబృందానికి. దాంతో చివర్లో కొన్ని సరదా సన్నివేశాల్ని యాడ్ చేసి, షూట్ చేశారని తెలుస్తోంది. ఏ సినిమాకైనా ఇలాంటి జోడింపులు మామూలే. పైగా తండేల్ కు కావల్సినంత సమయం ఉంది. డిసెంబరులో ఈ చిత్రాన్ని విడుదల చేద్దామనుకొన్నారు. సంక్రాంతి రేసులోనూ తండేల్ పేరు వినిపించింది. చివరికి ఫిబ్రవరి 7కు షిఫ్ట్ అయ్యింది. ఈలోగా కొంత రీవర్క్ చేసే అవకాశం దక్కింది. దాంతో.. కామెడీని మిక్స్ చేయగలిగారని తెలుస్తోంది.
మరోవైపు ప్రమోషన్ కూడా కాస్త గట్టిగానే ప్లాన్ చేస్తోంది చిత్రబృందం. తమిళనాట కార్తీని తీసుకొచ్చారు. ముంబై ఈవెంట్ లో అమీర్ ఖాన్ కనిపించాడు. త్వరలోనే ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేద్దామనుకొంటున్నారు. ఈ కార్యక్రమానికి బన్నీ వస్తున్నాడు. ‘పుష్ప 2’ తరవాత బన్నీ విషయంలో చాలా వ్యవహారాలు జరిగాయి. చాలా కాలంగా మీడియా ముందుకు రావడం లేదు. కొంత విరామం తరవాత.. బన్నీ కనిపించే ఫంక్షన్ ఇదే కావడంతో ఫోకస్ ఆటోమెటిగ్గా పెరుగుతుంది. అది సినిమా ప్రమోషన్లకూ హెల్ప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి 6 న ప్రీమియర్ షోలు వేసేందుకు చిత్రబృందం రెడీ అవుతోంది. పర్మిషన్లు రావాల్సివుంది.