వైసీపీ హయాంలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు..సోషల్ మీడియా కార్యకర్త అంటే ఖచ్చితంగా కేసులు పడాల్సిందే. ఆ స్థాయిలో పెద్ద ఎత్తున అక్రమ కేసులు నమోదయ్యాయి. చాలా మందిపై సోషల్ మీడియాతో సంబంధం లేని తప్పుడు కేసులు పెట్టారు. వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరిన అజయ్ అమృత్ అనే వ్యక్తిపై ఏకంగా గంజాయి కేసులు పెట్టారు. మరో వ్యక్తిని సోషల్ మీడియా పేరు పెట్టి గే అని ప్రచారం చేశారు. మరో కార్యకర్తపై .. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త రైలు కింద పడి చనిపోతే..దానికి కారణం ఆ వ్యక్తి పెట్టిన పోస్టేనని అరెస్టు చేశారు. ఇలాంటి కేసులతో వారంతా సతమతమవుతున్నారు.
తెలుగుదేశం విజయం సాధించిన తర్వాత ఇలాంటి కేసుల వివరాలన్నింటినీ సేకరించారు. వాటిని ఎలా ఎత్తివేయాలన్నదానిపై పరిశీలన జరుపుతున్నారు. న్యాయపరంగా చిక్కులు రాకుండా.. ఆ కేసులు ఎత్తేయాల్సి ఉంది. కేసులు కొనసాగించి.. కొట్టివేసేలా చేయాలంటే.. ఇప్పుడల్లా జరిగే పని కాదు. అందుకే చంద్రబాబు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ అంశాన్ని చర్చించారు. మరో ఆరేడు నెలల్లో అన్ని కేసులు ఎత్తివేసేలా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని..దానికి ట్రిబ్యునల్ మాత్రమే సరైనదని నిర్ణయానికి వచ్చారు.
అయితే ఈ ట్రిబ్యునల్ ఒక్క అక్రమ కేసులపై మాత్రం కాదు.. వైసీపీ నేతల అరాచకాలపై కూడా విచారణ చేసే అవకాశాలు ఉన్నాయి. విస్తృతమైన అధికారాలతో ఈ ట్రిబ్యూనల్ ను ఏర్పాటు చేసి..విచారణలను వేగంగా పూర్తి చేయనున్నారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను ప్రజల ముందు పెట్టి..బాధితుల్ని ఆదుకుని.. అరాచకాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యల దిశగా ప్రయత్నాలు చేయనున్నారు.