తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కనీవినీ ఎరుగని విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ.. ఆ ఉత్సాహంలో మహానాడును అద్భుతంగా చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. కడప గడ్డపై ఈ సారి మహానాడు నిర్వహించబోతున్నారు. కోటి మంది సభ్యులతో ఈ సారి టీడీపీ మరింత. బలంగా కనిపిస్తోంది. ఈ స్థాయిలో సభ్యత్వాలు నమోదు కావడానికి .. నారా లోకేష్ చేసిన కృషే కారణం అని పొలిట్ బ్యూరో అభినందించింది. అందుకే మహానాడులో నారా లోకేష్ కు ప్రమోషన్ ప్రకటన ఉంటుందన్నది సంకేతాలు వస్తున్నాయని ఆ పార్టీ వర్గాలు అంచనాకు వస్తున్నారు.
నారా లోకేష్ ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఏ పదవి అయినా మూడు సార్లు మాత్రమే ఉండాలన్నది తన అభిమతమని ఇప్పటికి మూడు సార్లు ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను కాబట్టి తన పదవిలో మరొకరికి చాన్సివ్వాలన్నది తన ఉద్దేశమని లోకేష్ చెబుతున్నారు. అందుకే ఈ సారి జాతీయ. ప్రధాన కార్యదర్శికి మరో నేతకు అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. మరి లోకేష్‌కు ఎలాంటి బాధ్యతలు ఇస్తారన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతుంది.
మహానాడులో నారా లోకేష్ ను.. టీడీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించవచ్చని కొంత మంది అంచనా వేస్తున్నారు. దీనికి కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం పార్టీ వ్యవహారాలను పూర్తి స్తాయిలో నారా లోకేష్ చూస్తున్నారు. కార్యకర్తల సంక్షేమం, క్యాడర్ కు పదవులు సహా అన్న విషయాల్లోనూ ఆయన హవానే నడుస్తోంది. అందుకే అధికారికంగా పార్టీపై ఆయనకే పెత్తనం ఇస్తే బాగుంటుందన్న ఆలోచన చేస్తున్నారు. మహానాడుకు ఇంకా సమయం ఉన్నందున .. ఈ అంశంపై చర్చ ఇప్పుడిప్పుడే ప్రారంభం కాకపోవచ్చని భావిస్తున్నారు.