భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ తులం బంగారం కోసం ఆశపడి కాంగ్రెస్ కు ఓట్లు వేశారని ఇప్పుడు బాగా అయిందని ప్రజల్ని ఎగతాళి చేస్తున్న వైనం బీఆర్ఎస్ పార్టీ నేతల్ని కూడా విస్మయానికి గురి చేస్తోంది. తాము లేకపోతే ప్రజలంతా కష్టాల్లో ఉండిపోతారన్న ఓ భ్రమలో ఉండిపోతున్న నాయకత్వాన్ని చూసి వారికి ఏమనుకోవాలో తెలియని పరిస్థితి. ప్రజా తీర్పును ఎప్పుడైనా.. ఎవరైనా గౌరవించాలి. ఎందుకంటే ప్రజల తీర్పు ప్రజాస్వామ్యంలో అంతిమం. అతి తప్పయ్యే చాన్స్ లేదు. ప్రజలు అధికారం ఇస్తే తప్పుడు పనులకు వాడుకుంటారేమో కానీ అది ప్రజల బాధ్యత కాదు.
ఈ అహంకారం వల్లనే ప్రజలు ఓడించారు !
బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైనా రోజున కేసీఆర్ ఎంత అహంకారంతో వ్యవహరించారో ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఆ రోజున ఆయన కనీసం తన రాజీనామా పత్రాన్ని స్వయంగా గవర్నర్ కు ఇవ్వలేదు. పీలతో పంపించి ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. ప్రజలు తప్పుడు నిర్ణయం తీసుకున్నారని నిందించారు. ఆ తర్వాత ఆయన ప్రజల్లోకి వచ్చి.. పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రచారం చేశారు. అప్పుడు కూడా ప్రచారంలో మీరు తప్పు చేశారన్నట్లుగా మాట్లాడారు. ఈ కారణంగా ఒక్క ఎంపీ సీటు కూడా రాకుండా చేశారు. అయినా కేసీఆర్ ప్రజల తీర్పును .. వారి అత్యాశగానే చెబుతున్నారు.
తులం బంగారం కోసం ఓడిస్తే.. ఇంక గెలవడం సాధ్యమేనా ?
తెలంగాణ ప్రజలు నిజంగా తులం బంగారం కోసం కేసీఆర్ ను ఓడిస్తే… ఇక ఆయన జీవితంలో గెలవడం అసాధ్యం. ఎందుకంటే తర్వాత రెండు తులాలు ఇస్తారు. గతంలో కేసీఆర్ ఇస్తామన్న మేనిఫెస్టోను నమ్మలేదు కాబట్టి .. ఈ సారి నమ్ముతారన్న గ్యారంటీ లేదు. ప్రజలు అదే ఆశలకు లోనై ఓట్లు వేస్తే.. బీఆర్ఎస్పార్టీ ఇప్పుడు కాదు.. ఎప్పుడో మూతపడి ఉండేది. కేసీఆర్ తెలంగాణ పేరుతో చేసిన రాజకీయాల్ని ముందుగానే గుర్తించి ఉండేవారు. కేసీఆర్ ప్రజల్ని అలాగే తక్కువ అంచనా వేస్తూ పోతే.. బీఆర్ఎస్ కు బొంద పెట్టుడు ఖాయమని అనుకోవచ్చు.
ప్రజల్ని గౌరవించడం నేర్చుకోవాలి !
పార్టీ నేతలు కూడా ప్రజలే. కానీ వారు పార్టీ నేతలు అనే సంగతి గుర్తుంచుకోవాలి. వారు వచ్చి జీ హుజూర్ అన్నంత మాత్రాన ప్రజలంతా వచ్చి జీ హూజూర్ అంటారని అనుకోలేరు. ప్రజలు ఎవరికి అధికారం ఇవ్వాలో వారు నిర్ణయించుకుంటారు. అంత మాత్రాన వారిని తప్పు పడితే.. అంత కన్నా స్వయంకృతాపరాథం మరొకటి ఉండదు. కేసీఆర్ పదే పదే అదే తప్పు చేస్తున్నారు. ఎప్పటికి తెలుసుకుంటారో.. తెలుసుకునే సరికి అంతా అయిపోతుందో కానీ.. మార్పు మాత్రం వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.