కాంగ్రెస్ పార్టీకి చెందిన పది నుంచి పదిహేను మంది ఎమ్మెల్యేలు తమకు బిల్లులు, పనులు దక్కడం లేదన్న అసంతృప్తితో ఓ కూటమిగా మారిన వ్యవహారం కాంగ్రెస్లో కలకలం రేపుతోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీరుతో వారు అసంతృప్తికి గురయ్యారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ నేతలకు ప్రభుత్వంలో పనులు అవుతున్నాయని, కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రం ఆలస్యం చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. పది మంది ఎమ్మెల్యేలు ఎక్కడ కలిశారో తెలియదు కానీ.. తాము సమావేశం అయినట్లుగా బీఆర్ఎస్ సోషల్ మీడియాకు లీక్ చేయడంతో కలకలం రేగింది.
ఎమ్మెల్యేల సమావేశ వార్తలతో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఎమ్మెల్యేలకు ఫోన్ చేశారు. సమావేశం అయ్యారో లేదో తెలుసుకున్నారు. వారు చెబుతున్న అంశాలపై సావధానంగా విన్నారు. ముఖ్యమంత్రితో మాట్లాడదామని సర్ది చెప్పినట్లుగా తెలుస్తోంది. మరో వైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపై ఫోకస్ చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కాంగ్రెస్ ముఖ్య నేతలు, మంత్రులతో సమావేశం అయ్యారు. అధికారులు ఎవరూ రావొద్దని చెప్పడంతో ఇది రాజకీయ పరిణామాలపై చర్చించడానికి పెట్టుకున్న సమావేశంగా తేలింది. అయితే ఇందులో ఏం చర్చించారన్నదానిపై స్పష్టత లేదు.
ఆ ఎమ్మెల్యేలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహారం పై మాత్రమే అసంతృప్తితో ఉన్నారని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో అసంతృప్తికి గురయినట్లుగా తెలుస్తోంది. ఈ ఎమ్మెల్యేల అసంతృప్తిని బీఆర్ెస్ అడ్వాంటేజ్ గా తీసుకునే పరిస్థితి లేదు. వీరు కాంగ్రెస్ ను ధిక్కరించాలన్న అభిప్రాయంతో లేకపోయినప్పటికీ.. ఎమ్మెల్యేలుగా ఉన్నా తమకు పనులు జరగకపోవడంతోనే ఈ సమావేశం పేరుతో అసంతృప్తిని హైకామండ్ కు తెలిసేలా చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది.