ఒకప్పుడు రాజకీయ పార్టీలు కార్యకర్తల మద్దతు, నేతల వ్యక్తిగత పేరు ప్రతిష్టలు, ప్రజాధారణ, సిద్దాంతాలు ఆధారంగా పనిచేసేవి…ఎన్నికలలో పోటీ చేసేవి. కానీ వివిధ కారణాలతో, వివిధ రంగాలకి చెందిన ప్రముఖులు రాజకీయాలలోకి ప్రవేశించడం మొదలుపెట్టడంతో పార్టీల ఆలోచనా, పనిచేసే విధానాలు మారిపోయాయి. ఆ ప్రభావం ఎన్నికలకి కూడా విస్తరించడంతో సామాన్య కార్యకర్తలు ఎవరూ పోటీ చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికలు మొదలు లోక్ సభ ఎన్నికల వరకు అన్నిటికీ డబ్బే ప్రధానమయిపోయింది. ఎవరు ఎక్కువ ఖర్చుపెట్టగలరో వారే అభ్యర్ధులు. ఎన్నికలలో పోటీ చేయడానికి అదే ప్రధాన అర్హతగా మారిపోయింది. రాజకీయాలలోకి రావలనుకొంటున్న ఆ అభ్యర్దులకి ఏ పార్టీ అయినా ఒక్కటే. పార్టీలకి కూడా వారు ఎవరైనా ఒకే! ఆశయాలు, సిద్దాంతాలు వంటివన్నీ ప్రజల ముందు వల్లించడానికి మాత్రమే పనికివస్తాయి. దీనితో మొత్తం ఎన్నికల స్వభావమే మారిపోయింది. కోట్లు ఖర్చు పెట్టి విజయం సాధించగలమనే ధీమాతో బరిలో దిగున్న అభ్యర్ధులను చూస్తుంటే ఇక ప్రజలు, వారి అభిప్రాయలతో సంబంధం లేకుండానే ఎన్నికలు జరుగుతున్నట్లు తయారయింది పరిస్థితి.
ఈ పరిస్థితులలో మళ్ళీ ప్రజలతో మమేకమయ్యి వారి సహకారంతో అధికారంలోకి రావాలని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి భావించడం చాలా మంచి ఆలోచనే. పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు నిత్యం ప్రజల మద్య ఉంటూ వారి సమస్యల కోసం ప్రభుత్వంతో పోరాడటం ద్వారానే ప్రజలకి చేరువయ్యి అధికారంలోకి రాగలమనే పాత నిజాన్ని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మరోమారు కనుగొన్నారు. అందుకే ఈనెల 8నుంచి “గడప గడపకి వైకాపా” అనే కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. దాని ద్వారా పార్టీ నేతలందరూ ప్రజలకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తూనే, తెదేపా పరిపాలనలో లోపాలు, వైఫల్యాలు, అవినీతి గురించి ప్రజలకి తెలియజెప్పాలని నిర్ణయించుకున్నారు. దాని కోసం వంద ప్రశ్నలతో కూడిన కరపత్రాలని ప్రజలకి అందజేసి చంద్రబాబు నాయుడు పాలనపై ప్రజాభిప్రాయసేకరణ చేస్తారు.
వచ్చే ఎన్నికలలో తెదేపా డబ్బు వెదజల్లి గెలవాలనుకొంటే తమ పార్టీ ప్రజాధారణతో దానిని ఓడిస్తామని జగన్ చెపుతున్నారు. ఆవిధంగా జరిగితే అది మన ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా గొప్ప విషయమే అవుతుంది. కానీ తెదేపా డబ్బు వెదజల్లి ఎన్నికలలో గెలవాలనుకొంటునప్పుడు, తన వెనుక ప్రజలున్నరనే నమ్మకంతో వైకాపా సామాన్య కార్యకర్తలని బరిలో దింపగలదా? వచ్చే ఎన్నికలలో అభ్యర్ధుల ఆర్ధిక శక్తిని ప్రధాన అర్హతగా పరిగణించకుండా ఉండగలదా? అంటే అది అసాధ్యమనే అర్ధం అవుతోంది. కనుక ఎన్నికలప్పుడు మళ్ళీ యధాప్రకారం ‘సౌండ్ పార్టీలకే’ టికెట్స్ కేటాయించక తప్పదు. వైకాపా మొదలుపెట్టబోతున్న ఈ గడప గడపకి కార్యక్రమం ద్వారా ప్రజలకి మరింత చేరువయ్యి, తన కోటీశ్వరులైన అభ్యర్ధుల విజయావకాశాలని మెరుగుపరుచుకోవడానికే ఇది ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.