ఈ సంక్రాంతికి దిల్ రాజు నుంచి రెండు సినిమాలు వచ్చాయి. ఒకటి గేమ్ చేంజర్, రెండోది సంక్రాంతికి వస్తున్నాం. రెండు సినిమాల రిజల్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేం లేదు. సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ కాకపోయి ఉంటే, దిల్ రాజు ఇప్పట్లో తేరుకొనేవాడే కాదు. కాకపోతే… గేమ్ చేంజర్ రిజల్ట్ ఇంకా గుచ్చుతూనే ఉంది. నిజానికి ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకొన్నాడు దిల్ రాజు. తన దృష్టంతా శంకర్ సినిమాపైనే. సంక్రాంతికి వస్తున్నాంని పట్టించుకొన్నదే లేదు. కానీ.. గేమ్ చేంజర్ ఫట్టయి, సంక్రాంతికి వస్తున్నాం హిట్టయ్యింది. ఈ ఫలితాలు దిల్ రాజుకి గొప్ప పాఠాలు. బడ్జెట్ నీ, కాంబినేషన్నీ చూసి సినిమాలు తీయకూడదని, కథనే నమ్ముకోవాలన్న సత్యాన్ని చెప్పిన సినిమాలు ఇవి. ఇదే విషయం ‘సంక్రాంతికి వస్తున్నాం’ డిస్టిబ్యూటర్ల మీట్ లో మరోసారి గుర్తు చేసుకొన్నాడు దిల్ రాజు.
బడ్జెట్ల వల్ల, కాంబోల వల్ల సినిమాలు ఆడవన్న నిజం తమకూ తెలుసని, కానీ ఏదో ఓ మాయలో పడిపోతామని, మళ్లీ.. వాస్తవాలు తెలుసుకొని సరైన దారిలో నడుస్తామని, అలా నడిచే అవకాశం కలిగించిన సినిమానే సంక్రాంతికి వస్తున్నాం అని ఈ సందర్భంగా తమ సినిమాల్ని తానుగా విశ్లేషించుకొన్నారు దిల్ రాజు. డిస్టిబ్యూటర్లు కూడా ఇదే మాట చెప్పారు. బడ్జెట్లనీ, కాంబినేషన్లనీ కాకుండా కథని నమ్ముకొంటేనే మంచి సినిమాలు వస్తాయని, నిర్మాతలంతా ఆ దిశగా ఆలోచించాలని కోరారు. గేమ్ చేంజర్ రిజల్ట్ దిల్ రాజులో కొత్త మార్పు తీసుకురావడం ఖాయం. ఆయన ఇప్పుడు మళ్లీ తన సినిమాలపై రీ వర్క్ చేసుకొంటున్నారు. కొంతకాలం పెద్ద సినిమాలకు, పెద్ద హీరోలకూ దూరంగా ఉండాలని, మీడియం రేంజ్ సినిమాల్ని తీయాలన్న ఆలోచనకు వచ్చారని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రెస్ మీట్ లో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు కూడా అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.