పార్టీ కార్యకర్తలతో కేసీఆర్ మాట్లాడిన మాటలపై రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. దానిపై కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అయితే ఆయన మాటల్లో అంత పవర్ కనిపించలేదు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నారని .. దమ్ముంటే లగచర్లకు రావాలని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి లగచర్లకు వెళ్లడం అనేది ఆయన ఇష్టం.. వెళ్తే వెళ్తారు లేకపోతే లేదు..కానీ ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లడం అనేది ఆయన బాధ్యత. ఆయన బాధ్యతను నెరవేర్చకపోతే ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
కేసీఆర్ తన బాధ్యత నెరవేర్చడం లేదని.. అసెంబ్లీకి వస్తే అన్నీ చెబుతామని రేవంత్ పదే పదే అంటున్నారు. ఈ అంశంపై కేటీఆర్ కు కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ ఎలాంటి సమాధానం ఇవ్వాలో అర్థం కాని పరిస్థితి ఉంది. అందుకే ప్రతి సవాళ్లు చేస్తున్నారు కానీ.. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని చెప్పడం లేదు. గతంలో టైగర్ అసెంబ్లీకి వస్తుందని కేటీఆర్ చెప్పేవారు.. తర్వాత ఆయన అసెంబ్లీకి వస్తే తట్టుకోలేరని అనేవారు. తర్వాత మీ స్థాయికే కేసీఆర్ అక్కర్లేదని తాను చాలని కూడా అన్నారు. కానీ అవేమీ వ్యాలిడ్ కౌంటర్లలా అనిపించలేదు.
కేసీఆర్ అసలు ప్రజల్లోకి వెళ్లడం లేదు. ఫామ్ హౌస్ దాటి రావడం లేదు. ఎందుకు అన్నది మాత్రం వారికే తెలియాలి. కనీసం అసెంబ్లీ సమావేశాలకు వచ్చినా ప్రజలకు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అవమానిస్తే.. అది ఆయనకు రాజకీయంగా ప్లస్ అవుతుంది కానీ మైనస్ అయ్యే అవకాశం లేదు. ఈ విషయంలో రేవంత్ కూడా జాగ్రత్తగానే ఉంటారని ఇప్పటి వరకూ జరిగిన పరిణామాల్ని బట్టి అంచనా వేయవచ్చు. మరి కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా అడ్డుపడుతున్న అంశం ఏమిటో ?