విడుదలైన తొలి రోజే… ‘మా సినిమా ఫలానా రికార్డ్ బ్రేక్ చేసింది’ అంటూ పోస్టర్లు వేయడం.. అది చూసి జనాలు నవ్వుకోవడం చాలా కామన్ అయిపోయింది. థియేటర్లో జనాలు ఉండరు కానీ, పోస్టర్లపై మాత్రం భారీ అంకెలుంటాయి. రూ.100 కోట్లు దాటేశాం, రెండొందల కోట్లు కొట్టేశాం.. అని డబ్బాలు కొట్టుకోవడానికే తప్ప, పోస్టర్లు ఎందుకూ ఉపయోగపడవు. ఈ అంకెలన్నీ జిమ్మిక్కులే అని చిత్రసీమకూ తెలుసు. జనాలకూ తెలుసు. అలాంటప్పుడు ఎందుకీ బిల్డప్పులు? ఎవరి కోసం? ఎవరిని నమ్మించడం కోసం?
ఈ రోజు ‘సంక్రాంతికి వస్తున్నాం’ డిస్టిబ్యూటర్ల ప్రెస్ మీట్ జరిగింది. ‘గత నాలుగైదేళ్లలో మా డిస్టిబ్యూటర్లకు డబ్బులు మిగిల్చిన సినిమా ఇదే’ అని వాళ్లంతా ఢంకా బనాయించి చెప్పారు. మరి ఈ నాలుగైదేళ్లలో హిట్టయిన సినిమాలు డబ్బులు తీసుకురాలేదా? అవన్నీ జిమ్మిక్కులేనా? పోస్టర్లపై అంకెలు చూసి జనాలు నవ్వుకొంటున్నారని, అవన్నీ కాకి లెక్కలని ఓ డిస్టిబ్యూటర్ చెప్పాడు. ‘పోస్టర్లపై ఈ ఫేక్ అంకెలు ఎందుకు’ అని అడిగితే `నిజాలు మాట్లాడితే కొంతమంది నిర్మాతలకు కష్టంగా ఉంటుందని, కడుపు చించుకొంటే కాళ్ల మీద పడుతుంద`ని మరో డిస్టిబ్యూటర్ ఆవేదన వ్యక్తం చేశాడు. దిల్ రాజు మాటలు కూడా అలానే ఉన్నాయి. ‘గేమ్ చేంజర్’ తొలి రోజు దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఓ పోస్టర్ వదిలారు. తొలి రోజు వసూళ్లలో రికార్డ్ బ్రేక్ అయ్యిందంటూ గొప్పలు చెప్పుకొన్నారు. ఆ అంకెలు చూసి అంతా హేళన చేశారు. బాగా ట్రోల్ అయిన వ్యవహారం అది. దీనిపై దిల్ రాజు ఈరోజు స్పందించారు. అలాంటి పోస్టర్లు ఎందుకు వేయాల్సివస్తుందో తెలీదా? అంటూ రివర్స్‌లో జర్నలిస్టుల్ని ప్రశ్నించారు. అంటే ఫేక్ పోస్టర్ వదులుతున్నామన్న సంగతి జనాలకు తెలుసన్న విషయం దిల్ రాజుకీ తెలుసు. మరి అలాంటప్పుడు ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేయడం ఎందుకు?
నిర్మాతలు, డిస్టిబ్యూటర్లూ, జనాలూ ఈ అంకెల్ని నమ్మనప్పుడు అసలు ఇలాంటి అబద్ధపు ప్రచారాలూ, అనవసరపు ఆర్భాటాలూ ఎందుకు? ఓ సినిమా హిట్టయినా, ఫ్లాప్ అయినా జనాలకు తెలిసిపోతుంది. ఎన్ని వసూళ్లు వచ్చాయి అనేది అంకెల పరంగా అర్థం కాకపోయినా, నాలుగు డబ్బులు మిగిల్చిన సినిమానా? పోగొట్టిన సినిమానా? అనేది అర్థమైపోతుంది. ఇకనైనా ఇలాంటి ఫేక్ ప్రచారాలు నిర్మాతలు ఆపాల్సిన అవసరం ఉంది. లేదంటే జనాల ముందు మరింత చీప్ అయిపోతారు.