బాస్ ఈజ్ బ్యాక్…! దాదాపు తొమ్మిదేళ్ల తరవాత సినిమాలకు టచ్‌లో వచ్చాడు చిరంజీవి. రీ ఎంట్రీ అట్టహాసంగానే జరిగింది. మీడియాని పిలవలేదు గానీ, అన్ని పేపర్లూ, ఛానళ్లు ఆ ఎపిసోడ్‌ని బాగానే కవర్ చేశాయి. ఆ తరవాత చిరు.. మా టీవీ అవార్డు వేడుకలో చిందేసి అందరినీ ఆకట్టుకొన్నాడు. ఇప్పుడు సైమాలోనూ అదే జోరు. చిరురాజకీయాల్లో ఉన్నప్పుడు అవార్డు ఫంక్షన్లలో కనిపించడమే అరుదు. ‘మా’ టీవీలో తనకూ వాటా ఉండేది కాబట్టి, ఆ హక్కుదారుడిగా పాల్గొనేవాడంతే. ఇప్పుడు అలా కాదు. ఎవరు పిలుస్తారా.. అంటూ ఎదురుచూసేంత వరకూ వెళ్లింది వ్యవహారం. ”నా రీ ఎంట్రీ గురించిజనం ఏం మాట్లాడుకొంటున్నారు, మీడియా ఏమనుకొంటోంది” అంటూ చిరు ఆరాలు తీయడం మొదలైందని సమాచారం.
మీడియాలో తనని ఎంత కవర్ చేస్తున్నారన్న విషయంపైనా చిరు బాగా దృష్టి పెట్టారని తెలుస్తోంది. 150వ సినిమా కత్తిలాంటోడుకి విపరీతమైన పబ్లిసిటీ ఇవ్వాలని.. పీఆర్ వ్యవస్థని ఆయన ఆదేశించినట్టు స్పష్టమవుతోంది. మా టీవీ కోసం స్పెషల్ గా చేసిన ఫొటోషూట్ పిక్స్‌ని మీడియాకు రిలీజ్ చేయడం, సాక్షి పేపర్‌కి అడక్కుండానే ఇంటర్వ్యూ ఇవ్వడం వెనుక చిరంజీవి పబ్లిసిటీ యావ విపరీతంగా కనిపిస్తుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. చిరంజీవి సినిమా అంటే మీడియాకు, ప్రేక్షకులకూ క్రేజే. పైగా 150వ సినిమా. సుదీర్ఘ విరామం తరవాత చిరు కెమెరాముందుకు వచ్చే సందర్భం ఇది. అందుకే చిరు వద్దన్నా.. ప్రమోషన్లు జరుగుతూనే ఉంటాయి. కావాలని ప్రమోషన్ల కోసం ఆరాటపడితేనే.. కాస్త ఇబ్బంది ఎదురవుతుంది. ఎప్పుడూ లేనిది చిరు ప్రమోషన్ల గురించి ఇంతగా ఆరా తీయడం ఆయన సన్నిహితులకే షాక్ ఇస్తోంది. ఎంతటి హీరో అయినా…ప్రమోషన్ లేకపోతే అలాంటి సినిమాలు జనంలోకి వెళ్లవని చిరు ఇప్పటికి తెలుసుకొన్నారేమో??