వైసీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి నాలుగు రోజుల కిందట లోటస్ పాండ్లో షర్మిలతో మూడు గంటల పాటు సమావేశం కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయింది. రాజకీయాల నుంచి పూర్తిగా విరమించుకున్నానని పొలం పనులు చేసుకుంటానని విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత షర్మిలతో సమావేశం కావడం వెనుక రాజకీయం ఉందా లేదా అన్నది కీలకంగా మారింది. అయితే విజయసాయిరెడ్డి రాజకీయంగా షర్మిలపై చేసిన అనుచిత వ్యాఖ్యల వల్ల ఆమెతో దెబ్బతిన్న సంబంధాలను మళ్లీ పునరుద్ధరించుకోవడానికి వెళ్లారని అంటున్నారు.
జగన్ తో ఆస్తుల గొడవలో విజయసాయిరెడ్డి ఓ కీలక సాక్షి. అక్రమాస్తులన్నీ కుడబెట్టినప్పుడు వైఎస్ఆర్ .. విజయసాయిరెడ్డినే అన్ని కంపెనీలు జగన్ పేరు మీద ఎందుకు పెడుతున్నావని విజయసాయిరెడ్డిని అడిగారట. తర్వాత గిఫ్ట్ డీడ్ చేయవచ్చని విజయసాయిరెడ్డి చెప్పడంతో వైఎస్ఆర్ కూల్ అయ్యారని చెబుతారు . ఇదే విషయాన్ని షర్మిల గుర్తు చేస్తే.. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన విజయసాయిరెడ్డి ఆమె చంద్రబాబుతో భేటీ కావడం..పసుపు రంగు చీర కట్టుకోవడం గురించి మాట్లాడారు. అలాగే వివేకా హత్య కేసు విషయంలోనూ ఆయన నిజాలు చెప్పడం లేదు. విజయసాయిరెడ్డి రాజీనామా చేసినప్పుడు ఇప్పటికైనా ఆయన అన్ని నిజాలు చెప్పాలని షర్మిల సూచించారు.
ఈ పరిణామాలతో విజయసాయిరెడ్డి షర్మిలతో సమావేశమయ్యారు. జగన్ తో రాజకీయంగా ప్రయాణించడం వల్ల ఆయన చెప్పింది చేశానని.. వైఎస్ బిడ్డను కించపర్చాలన్న ఉద్దేశంతో తాను ఆ మాటలు మాట్లాడలేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. రాజకీయాల్లోకి మళ్లీ వచ్చే ఉద్దేశం ఉందో లేదో కానీ మూడుగంటలా పాటు షర్మిలతో విజయసాయిరెడ్డి ముచ్చటించారు. అక్కడే భోజనం చేసినట్లుగా తెలుస్తోంది. ఒక వేళ విజయసాయిరెడ్డి షర్మిలకు సాయం చేయాలని వైఎస్ వివేకా కేసులో ఏం జరిగిందో మొత్తం సీబీఐకి చెప్పాలని డిసైడైతే… జగన్మోహన్ రెడ్డికి చాలా కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది.