మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై అసంతృప్తితో ఓ పది మంది ఎమ్మెల్యేలు గ్రూపుగా సమావేశం పెట్టుకుని దాన్ని మీడియాకు లీక్ చేయడం చిన్న విషయం కాదు. అవసరమైతే తెగిస్తామని చెప్పడానికి వేసిన మొదటి అడుగుగా భావించాలి. అయితే వారి అసంతృప్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైనా లేకపోతే.. ఆపరేషన్ ఆకర్ష్లు ఏమైనా జరుగుతున్నాయా అన్నది కాంగ్రెస్ పెద్దలు కాస్త సీరియస్ గానే దృష్టి పెట్టాల్సి ఉంది.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంట్రాక్టులు, పనుల విషయంలో మొత్తం తన కోటరీకే ప్రాధాన్యం ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఆయనకు అడ్డు చెప్పడం లేదు. పనులు, బిల్లులు రావడం లేదని ఎమ్మెల్యేలు ఉక్కపోతకు గురవుతున్నారు. అదే సమయంలో పొంగులేటి సొంత వర్గాన్ని పెంచుకునేందుకు బీఆర్ఎస్ లోని సన్నిహితులకు అవకాశం కల్పిస్తున్నారు. ఇదంతా బహిరంగరహస్యం. అందుకే ఎమ్మెల్యేలు అసహనంతో ఉన్నారు. సమావేశమై ఓ లీక్ ను మీడియాకు పంపారు.
దీని వెనుక ఎవరున్నారన్నది ఇప్పుడు కీలకం. అంతే కాదు .. ఈ ఎమ్మెల్యేల అసంతృప్తిని బీజేపీ క్యాష్ చేసుకోవాలనుకుంటే పెద్ద విషయం కాదు. కానీ తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు అస్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వాన్ని కూలగొడితే ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది తేల్చుకోవడం కష్టం.కేసీఆర్ తన ఎమ్మెల్యేలందర్నీ బీజేపీకి పంపినా.. బీజేపీ ముందుకు వచ్చేచాన్సులు తక్కువ. మరో నాలుగేళ్లు ఎదురు చూస్తామని మాకు తొందరేం లేదని కిషన్ రెడ్డి అంటున్నారు.