గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము బైక్ మీద ఒక్కరే వెళ్లి గుడివాడ పట్టణంలో పలువర్గాలను కలిశారని ఎవరూ .. దందాలు జరుగుతున్నట్లుగా ఫిర్యాదు చేయలేదని ఆయన పబ్లిక్ రిలేషన్స్ టీం కొత్తగా ప్రచారం చేస్తోంది. దందాలు జరుగుతున్నాయో లేదో.. ముందు ఇలాంటి స్కిట్లు వేయాల్సిన పరిస్థితి వచ్చిందంటేనే తప్పు జరిగిందని అర్థం. వెనిగండ్ల రాము అమెరికాలో బాగా సంపాదించారని ఆయనకు డబ్బు అవసరం లేదని.. గడ్డం గ్యాంగ్ లాగా దోపిడీ చేయరని జనం అనుకున్నారు.కానీ షాడో ఎమ్మెల్యేగా తులసిబాబు అనే వ్యక్తిని పెట్టుకోవడంతో ప్రజల ఆశలు అడియాశలయ్యాయి.
వెనిగండ్ల రాముకు తెలిసి చేశారో.. తులసిబాబు సొంత పెత్తనమో కానీ.. గుడివాడను ఆరు నెలల్లోనే ఆయన చేయాల్సిన విధంగా చేశారు. కొడాలి నాని ఉన్నప్పటి పరిస్థితికి ఇప్పటికీ తేడా లేదని అనిపించారు. లక్కీగా ఆ తులసిబాబు .. రఘురామకృష్ణరాజు కేసులో కీలక నిందితుడిగా ఉండటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆయనను అరెస్టు చేసి.. మొత్తం బయటకు లాగుతున్నారు. పోలీసులపై ఆయన చేసిన రుబాబు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకు ఆయన ఇంత రెచ్చిపోయాడు అంటే.. ఆయన వెనుక గుడివాడ ఎమ్మెల్యే ఉన్నారు.
దమ్ముంటే గుడివాడ రావాలని ఆయనతో పాటు వచ్చిన అనుచరులు చేసిన సవాల్ చూసి పోలీసులకు మైండ్ బ్లాంక్ అయింది. గుడివాడను ఆయన ఎలా అడ్డాగా చేసుకున్నారో క్లారిటీ వస్తుంది. విషయం బయట పడిన తర్వాత అయినా గుడివాడ రాము జాగ్రత్త పడాల్సింది. ఆయనతో సంబంధం లేదని ప్రకటించాల్సింది.కానీ అలా చెప్పకుండా జైలు వద్దకు వెళ్లి గంట సేపు భేటీ అయ్యారు. ఇప్పుడు ఇమేజ్ డ్యామేజ్ అయిందని గుడివాడలో బైక్ వేసుకుని తిరిగితే.. జరిగిపోయిన నష్టం భర్తీ అవుతందా?