బడ్జెట్లో అన్యాయం అని బీఆర్ఎస్, వైసీపీ రాజకీయం ప్రారంభించాయి. అయితే ఆ రెండు పార్టీలకు బడ్జెట్ పెట్టిన బీజేపీపై పోరాడే ధైర్యం లేదు. రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలపై విరుచుకుపడాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే మీరు తీసుకు రాలేకపోయారన్న కారణం చెబుతున్నారు. మరి అసలు బడ్జెట్ పెట్టిన బీజేపీని విమర్శించాలి కదా .. అంటే.. ఆ ఒక్కటీ అడగొద్దంటున్నారు. ఈ రెండు పార్టీల నిస్సహాయత, బీజేపీని ప్రశ్నించలేని పరిస్థితి ప్రత్యక్షంగానే కనిపిస్తోంది.
వైసీపీకి బీజేపీని పల్లెత్తు మాట అనలేదు. ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జనసేన ఉన్నప్పటికీ వైసీపీ ఏ మాత్రం సిగ్గుపడకుండా బీజేపీకి సపోర్టు చేస్తోంది. కనీసం వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం కూడా చేయడం లేదు. అందుకే ఆ పార్టీ అధినేత అసలు మాట్లాడరు. బుగ్గన మాత్రం ప్రెస్ మీట్ పెట్టి బీహార్ కే ఎక్కువ వచ్చాయని ఏపీకి ఎక్కువ తేలేదని విమర్శించారు. అదంతా టెంప్లెట్ రాజకీయం. వారి నిస్సహాయతను ప్రజలు కూడా పట్టించుకోవడం మానేశారు. మరి బీఆర్ఎస్కు ఏమయింది ?
ఇప్పుడు బీఆర్ఎస్ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కాంగ్రెస్ తో పాటు బీజేపీపైనా పోరాటం చేయాలి. లేకపోతే ఆ పార్టీ మెల్లగా బీఆర్ఎస్ ఓటుబ్యాంకును కైవసం చేసుకుంటూ పోతోంది. ఇప్పుడు కూడా కేంద్ర బడ్జెట్ విషయంలో కాంగ్రెస్ ను నిందిస్తూ టైం పాస్ చేసుకుంటే.. ప్రజలు మరో విధంగా ఆలోచిస్తారు. బీజేపీపై బీఆర్ఎస్ అగ్రెసివ్ గా దాడి చేసినప్పుడే తన ఓటు బ్యాంకును వలస పోకుండా ఆపగలుగుతుంది. కానీ అలాంటి ధైర్యం బీఆర్ఎస్ చేయలేకపోతోంది.