ప్రైవేటు యూనివర్సిటీల నిర్వాకాలు వరుసగా బయటపడుతున్నాయి. తమకు ఏ గ్రేడింగ్..ఏ ప్లస్ .. ఏ ప్లస్ ప్లస్ గ్రేడింగ్ ఉందని చాలా యూనివర్శిటీలు గొప్పగా ప్రకటించుకుంటూ ఉంటాయి. అలా ప్రకటించుకోవడానికి కావాల్సినన్ని మౌలిక సదుపాయాలు, ట్రాక్ రికార్డు ఉంటాయో లేదో కానీ అవన్నీ లంచాలు ఇచ్చి తెచ్చుకునే సర్టిఫికెట్లు అని తాజాగా మరోసారి స్పష్టమయింది. గుంటూరులోని కేఎల్ యూనివర్సిటీ NAAC రేటింగ్స్ కోసం ఇన్స్పెక్షన్ కమిటీకి లంచాలు ఇచ్చి దొరికిపోయింది.
యూనివర్సిటీ యాజమాన్యంతో పాటు ఇన్స్పెక్షన్ బృందంపై సీబీఐ కేసు నమోదు చేసిది. మొత్తం 14 మందిపై FIR నమోదు, 10 మంది అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వైస్ ఛాన్సలర్ జీపీ సారథి వర్మ, వైస్ ప్రెసిడెంట్ కోనేరు రాజా హరీన్, యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ డైరెక్టర్ ఏ. రామకృష్ణ వంటి వారు ఉన్నారు. అలాగే NAAC ఇన్స్పెక్షన్ టీమ్ ఛైర్మన్ సమరేంద్రనాథ్ సాహా సహా టీమ్‌లో ఏడుగుర్ని అరెస్టు చేశారు. రూ. 37 లక్షల నగదు, 6 ల్యాప్‌టాప్‌లు, ఐ ఫోన్ వంటివి స్వాధీనం చేసుకున్నారు.
కేఎల్ యూనివర్శిటీకి మంచి పేరే ఉంది. మంచి విద్యా ప్రమాణాలున్న యూనివర్శిటీ.కానీ నాక్ గ్రేడింగ్ కోసం డబ్బులు చెల్లించాల్సి రావడం .. అదీ లంచాలుగా ఇన్‌స్పక్షన్ టీమ్‌కు ఇవ్వాల్సి రావడం వారి దురదృష్టమే. అన్నీ సరిగ్గా ఉన్నా ఏమీ ఇవ్వకపోతే.. రాంగ్ రిపోర్టు ఇస్తే తమకు నష్టమని వారు ఆ పని చేసి ఉండవచ్చు. ఇలాంటి వాటికి డబ్బులు పెట్టాల్సి రావడం వల్లనే ప్రైవేటు యూనివర్శిటీల్లో ఫీజులు లక్షల్లో ఉంటాయి. మధ్యతరగతి వారికి అందుబాటులో లేకుండా పోతున్నాయి.