విజయసాయిరెడ్డి రాజీనామా తర్వాత వైసీపీలో ఏం జరుగుతుందో చాలా మందికి అర్థం కావడం లేదు. విజయసాయిరెడ్డిని నమ్ముకుని పార్టీలో ఉన్న వాళ్లంతా ఇక లాభం లేదని అనుకుంటున్నారు. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి మొదటి నుంచి తన వర్గాన్ని మాత్రమే ప్రోత్సహించారు. విజయసాయిరెడ్డికి దగ్గర అనుకున్నవారిని ఎప్పుడూ పరిగణనలోకి తీసుకోలేదు. స్టేట్ కోఆర్డినేటర్ గా ఆయనకు పదవి ఇవ్వడంతో.. ప్రతి చిన్న పదవిలోనూ తనకు నమస్కారం పెట్టే వారినే ఎంచుకుంటున్నారు.
విజయసాయిరెడ్డి గతంలో నెంబర్ టు గా ఉన్నారు. ఆయన ద్వారా చాలా పదవులు పొందిన వారు ఉన్నారు. ఇప్పుడు వారికి దిక్కు లేకుండా పోయింది. కనీసం 30 శాతం మంది వైసీపీ నేతలు పార్టీ పదవులు.. ఇతర చదువులు పొందిన వారు విజయసాయిరెడ్డి ఆశీస్సులతో ఎదుగుతున్నారు. వారిని సజ్జల రామకృష్ణారెడ్డి ఏ మాత్రం దగ్గరకు తీసుకునే అవకాశాల్లేవు. అంతా కాదు ఇప్పుడు సజ్జల తప్ప జగన్ కు మరో ఆప్షన్ లేదు. సజ్జల చెప్పినట్లుగా నడుచుకోవాల్సిందే.
సజ్జల రామకృష్ణారెడ్డి చేయాల్సినదంతా చేశారు. కానీ తన మీదకు రాకుండా అన్నీ జగన్ తో సహా ఇతరుల మీద పడేలా చేశారు. తాను మాత్రం పార్టీపై పట్టు పెంచుకుంటున్నారు. పార్టీపై అభిమానంతో ఉండే కొంత మంది సజ్జల తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు. అయినా జగన్ వినిపించుకునే పరిస్థితుల్లో లేరు. విజయసాయిరెడ్డి లేకపోవడంతో ఇక ఆయన పని సులువు అయిందని జగన్ ను గుప్పిట పెట్టుకుని పార్టీలో పెత్తనం పెంచుకుంటారని ఊసూరుమంటున్నారు.