వైసీపీ అధినేత జగన్మోహన రెడ్డి మీడియాలో..సోషల్మీడియాలో పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు. విదేశీ పర్యటన నుంచి ఆయన తిరిగి వచ్చారని.. అసెంబ్లీకి వెళ్తారని మీమ్స్ వేస్తున్నారు కానీ.. అసలు వైసీపీలో ఇప్పటికిప్పుడు ఎవరు హైలెట్ అవుతున్నారంటే.. కేవలం కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాత్రమే.
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే అయిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి సోషల్ మీడియా అంటే చాలా ఆసక్తి. ఆయన చాలా ఖర్చు పెట్టి పదేళ్ల పాటు సోషల్ మీడియా టీంను నడిపారు. పెద్ద ఎత్తున ఆయనకు యూట్యూబ్ లో ఫాలయర్స్ ఉండేవారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఆయన వీడియోలు ఎలా వైరల్ అయ్యేవో చెప్పాల్సిన పని లేదు. ఓడిపోయిన తర్వాత ఆయన అన్నీ ఆపేశారు. ఇప్పుడు కొత్తగా యట్యూబ్ ఇంటర్యూలతో తెరపైకి వస్తున్నారు.
రెండు, మూడు యూట్యూబ్ చానళ్లకు ఇంటర్యూ ఇచ్చి కూటమి నేతల్ని పొగుడుతున్నారు. సినీ హీరోల్ని విమర్శిస్తున్నారు. అల్లు అర్జున్ కోసం కాదని రష్మిక కోసమే తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారు. హిందూపురం కాబట్టే బాలకృష్ణ గెలిచారని.. గుడివాడ అయితే గెలిచేవారు కాదని రకరకాలుగా చెబుతున్నారు. ఆయన మాటలు సోషల్ మీడియాలో .. ఏ పార్టీ వారికి కావాల్సినవి ఆ పార్టీ వారు కట్ చేసుకుని వాడుకుంటున్నారు. ఈ కారణంగా ఆయన ఇంటర్యూల్లోని బిట్లు వైరల్ అవుతున్నాయి
ఇంత చేస్తున్న కేతిరెడ్డి ధర్మవరం వైపు పోవడం లేదు. ఆయన క్యాడర్ అంతా బీజేపీతో పాటు కూటమి పార్టీల్లో చేరేందుకు వెళ్తోంది. ఆయన మాత్రం సోషల్ మీడియాల్లో ఇంటర్యూలు ఇచ్చుకుని జగన్ కంటే తనకే ఎక్కువ లైకులు వస్తాయన్నట్లుగా వైరల్ అవుతున్నారు.