తెలంగాణలో కులగణన వివరాలను ప్రభుత్వం విడుదల చేసింది. అసెంబ్లీలో పెట్టి ఆమోదం తీసుకుంటామని ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఖరారు చేయాలనుకుంటోంది. అసెంబ్లీలో ఆమోదించి వెంటనే చట్టం చేసి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటున్నారు. అయితే అసెంబ్లీలో పెట్టి ఆమోదించినంత మాత్రాన ఎవరి జనాభా తగ్గట్లుగా వారికి రిజర్వేషన్లు కల్పించలేరు. ఎందుకంటే రాజ్యాంగ పరంగా సాధ్యం కాదు.
బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వం ఎన్డీఏలో చేరక ముందు కులగణన చేశారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కోటాను 50 నుంచి 65 శాతానికి పెంచుతూ కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. అణగారిన వర్గాలకు రిజర్వేషన్ కోటాను 50 నుంచి 65 శాతానికి పెంచుతూ గెజిట్ నోటిఫికేషన్ను నితీష్ కుమార్ ప్రభుత్వం జారీచేసింది. అయితే నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగంలోని 14, 16, 20 అధికరణలను రాష్ట్ర ప్రభుత్వం తన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఉల్లంఘించిందని, తాము చేసిన వాదనలపై విచారణ జరిపిన హైకోర్టు స్పష్టంచేసింది.
ఇప్పుడు తెలంగాణలోనూ అదే రాజ్యాంగం కాబట్టి అదే తీర్పు వస్తుంది. ఒక వేళ పంచాయతీ ఎన్నికలు ప్రక్రియ ప్రారంభిస్తే..అవి మధ్యలోనే ఆగిపోతాయి. ఇదే జరిగితే మొత్తంగా ఆ ఎన్నికలను పక్కన పెట్టేసినట్లు అవుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించకపోతే చాలా సమస్యలు వస్తాయి. అందుకే బీహార్ కులగణన .. అనంతర పరిణామాలను అర్థం చేసుకుని రాజకీయాలు చేస్తే న్యాయస్థానాల్లో ఎదురు దెబ్బలు తగలవన్న వాదన వినిపిస్తోంది.