పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట కారణంగా కోమాలోకి వెళ్లిన అల్లు అర్జున్ చిన్నారి అభిమాని శ్రీతేజ్ కు విదేశీ వైద్యం అందించాలని భావిస్తున్నారు. నిర్మాత బన్నీ వాసు ఈ అంశంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై రెండు రోజుల కిందట వైద్యులు ఓ బులెటిన్ విడుదల చేశారు. ఈ ప్రకారం కోమా నుంచి బయటకు వచ్చారు కానీ ఎవర్నీ గుర్తించలేకపోతున్నారు. ఆహారం తీసుకోలేకపోతున్నాడు. ఈ పరిస్థితి మెరుగుపడటానికి ఎలాంటి అత్యాధునిక వైద్యం చేయించాలన్నదానిపై బన్నీ వాసు వైద్యులతో చర్చించినట్లుగా చెబుతున్నారు.
తొక్కిసలాట సమయంలో బ్రెయిన్ కు కాసేపు రక్త ప్రసరణ ఆగిపోయింది. తర్వాత పునరద్ధురణ జరిగినప్పటికీ అప్పటికే జరగాల్సినా నష్టం జరిగిపోయింది. ఇఫ్పుడు బ్రెయిన్ పూర్తి స్థాయిలో మళ్లీ పని చేస్తేనే శ్రీతేజ్ మామూలు స్థితికి వస్తాడు. లేకపోతే కష్టం. అయితే వైద్యపరంగా ఇది అంత తేలిక కాదన్న వాదన వినిపిస్తోంది. విదేశాల్లో అత్యాధునిక చికిత్స అందిస్తే ఎలా ఉంటుందో బన్నీ టీం ఆలోచన చేస్తోంది.
విదేశీ ఆస్పత్రులకు తరలించాలా లేకపోతే విదేశీ డాక్టర్లను పిలిపించాలా అన్నదానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఖర్చు అంతా బన్నీ టీం పెట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ పిల్లవాడిని మళ్లీ సాధారణ స్థితికి తీసుకు వచ్చేందుకు అవసరమైన సాయం అంతా చేయాలని అనుకుంటున్నారు. తొక్కిసలాట జరిగినప్పటి నుండి అటు శ్రీతేజ్ కుటుంబానికి..ఇటు పుష్ప టీంకు వేదన తప్పడం లేదు.