ఎవరేం మాట్లాడినా, కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి. సున్నితమైన విషయాల్ని ప్రస్తావించేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. మెగా ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలియంది కాదు. ‘పుష్ప 2’ వచ్చినప్పుడు మెగా ఫ్యాన్స్ తమ ప్రతాపం చూపించారు. ‘గేమ్ చేంజర్’ వచ్చినప్పుడు బన్నీ ఫ్యాన్స్ రివైంజ్ తీర్చుకొన్నారు. లెక్క సరిపోయింది. ఇప్పుడు కూడా ‘గేమ్ చేంజర్’ రిజల్ట్ పై బన్నీ ఫ్యాన్స్ వెటకారం చేస్తుంటే, అల్లు అర్జున్ వ్యవహారశైలిని ఎప్పటికప్పుడు ట్రోలింగ్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్.
ఇప్పుడు ట్రోలర్స్‌కు ఇంకాస్త స్టఫ్ దొరికేలా చేశారు అల్లు అరవింద్. ‘తండేల్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి దిల్ రాజు హాజరయ్యారు. ఆయన్ని కాస్త ఎలివేట్ చేసే ప్రయత్నంలో ‘ఈవారం చాలా చేసేశాడు దిల్ రాజు ఓ సినిమాని ఇలా తీసి (గేమ్ చేంజర్) ఇంకో సినిమాకి ఎక్కడికో తీసుకెళ్లి (సంక్రాంతికి వస్తున్నాం)..’ అంటూ రెండు సినిమాల్నీ పోల్చారు. ‘గేమ్ చేంజర్’ తో ఫ్లాప్ ఇచ్చాడు అన్నది అల్లు అరవింద్ చెప్పదలచుకొన్న మాట. గేమ్ చేంజర్’ పేరు ప్రస్తావించకపోయినా, అది ఆ సినిమా గురించే అన్నది అర్థమైపోతోంది. ‘గేమ్ చేంజర్’ ఫ్లాపే. ఇందులో డిబేటే లేదు. కాకపోతే మెగా ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ మధ్య దుమారం రేగుతున్నప్పుడు ఇలాంటి విషయాల గురించి ప్రస్తావన లేకుండా ఉండేలా చూసుకొంటే బాగుండేది. కానీ అల్లు అరవింద్ అలా చేయలేకపోయారు. నిజానికి అరవింద్ ఎప్పుడూ బాలెన్స్డ్గా మాట్లాడతారు. వివాదాలకు ఎప్పుడూ తావు ఇవ్వరు. ఈసారి కూడా ఆయన ఈ చిన్న పోలిక తీసుకురాకుండా ఉండాల్సింది. అరవింద్ అలా మాట్లాడారో లేదో.. ఇలా ట్రోలింగ్ మొదలెట్టేశారు. ‘గేమ్ చేంజర్’తో చరణ్ పనైపోయిందంటూ ఓ వర్గం మళ్లీ కొత్త ఉత్సాహంతో ట్రోలింగ్ మొదలెట్టింది. దానికి ఉప్పు అందించింది మాత్రం అల్లు అరవిందే.