‘తండేల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ వస్తారని ప్రచారం చేసింది చిత్రబృందం. గీతా ఆర్ట్స్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి, బన్నీ ఎంట్రీ గురించి ఎవరూ షాక్ అవ్వలేదు. కాకపోతే… ఈమధ్య బన్నీ చాలా ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఓ సినిమా వేడుకలో బన్నీ కనిపించబోవడం ప్రత్యేకమే. అందుకే అందరి దృష్టీ.. ఈ ఈవెంట్‌పై పడింది. కానీ బన్నీ రాలేదు. దాంతో కొత్త చర్చకు దారి దొరికింది. బన్నీ ఈ ఈవెంట్‌కు ఎందుకు రాలేదన్న విషయంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
వేదికపై అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇటీవల అల్లు అర్జున్ విదేశాలకు వెళ్లొచ్చారని, తీవ్రమైన గ్యాస్ సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్నారని, అందుకే రాలేకపోయారని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇది చివరి నిమిషంలో చేసిన సర్దుబాటు కాదు. ఈ ఈవెంట్ కి సందీప్ రెడ్డి వంగా వస్తున్నాడన్న విషయాన్ని ఆదివారం మధ్యాహ్నమే దృవీకరించింది టీమ్. అంటే.. బన్నీకి ప్రత్యామ్నాయంగా సందీప్ ని తీసుకొచ్చారన్నమాట. ఈ విషయం ఆదివారం మధ్యాహ్నమే తేలిపోయింది. అయినా ఈవెంట్ వరకూ ఈ విషయాన్ని దాచి పెట్టింది టీమ్.
‘తండేల్’ అవుట్ పుట్ బన్నీ చూశాడని, దానిపై పూర్తి స్థాయిలో సంతృప్తి దక్కలేదని, స్టేజ్ ఎక్కి ‘సినిమా సూపర్ హిట్టు..’ అని నమ్మకంగా మాట్లాడలేని పరిస్థితి వచ్చిందని, అందుకే స్కిప్ కొట్టాడని ఓ వర్గం అంటోంది.
సంధ్య ధియేటర్ లో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్యాన్ని వాకబు చేయడానికి ఆదివారం ఆసుపత్రికి వెళ్లారు బన్నీ వాస్. శ్రీతేజ్‌ని మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తీసుకెళ్లాలని వైద్యులు సూచించార్ట. అంటే.. శ్రీతేజ్ ఆరోగ్యం ఇంకా ఆందోళన కరమైన స్థితిలో ఉన్నట్టే అర్థం. ఇలాంటి దశలో బన్నీ సినిమా వేడుకలకు హాజరవ్వడం సరైనది కాదని భావించి ఉండొచ్చు. అందుకే బన్నీ ఈ ఈవెంట్ కి రాలేదేమో అనుకోవాలి.