హైడ్రా కూల్చివేతలు అని మూడు వార్తలు వస్తే అందులో రెండు అమీన్ పూర్ నుంచే ఉంటున్నాయి. ఆ ప్రాంతంలో ఎక్కడా లేనంతగా కబ్జాలు ఉండటంతో కూల్చివేతలు చేపడుతున్నారు. దీనికి కారణం ఓ పదిహేనేళ్ల క్రితం అక్కడ స్థలాలకు..పొలాలకు డిమాండ్ ఉండేది కాదు. చాలా తక్కువధర ఉండేది. ఇప్పుడు ఊహించనంతగా ధరలు పెరిగిపోయాయి. ఓ చిన్న అపార్టుమెంట్ కూడా డెభ్బై లక్షలకు తక్కువ కాకుండా అమ్ముతున్నారు.
మండలంలోని అన్ని గ్రామాల్లో రియల్ ఎస్టేట్ బంగారంగా మారడంతో ప్రభుత్వ భూముల్ని రాజకీయనేతలు చెరబట్టడం ప్రారంభించారు. సంగారెడ్డి పారిశ్రామికంగా అభివృద్ది చెందిన ప్రాంతం. ఆయా పరిశ్రమల్లో పని చేసేవారు ఓ సొసైటీగా ఏర్పడి అప్పట్లో పలు చోట భూములు కొనుగోలు చేశారు. అయితే మౌలిక సదుపాయాల లేమి కారణంగా వాటిని అలా వదిలేశారు. కానీ రేట్లు పెరిగిన తర్వాత చాలా మంది ఆ భూములు తమవేనని క్లెయిమ్ చేసుకుంటూండటంతో సమస్యలు వస్తున్నాయి
అమీన్ పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 119 నుంచి 220 వరకు ఉన్న 408 ఎకరాల భూముల్లో చాలా ఏళ్ల కిందట 3800 మంది అక్కడ గ్రామపంచాయతీ లేఔట్ లో ఇంటి స్థలాలు కొని రిజిస్టర్ చేసుకున్నారు. కానీ ఇతర వ్యక్తులు ఆ స్థలం తమదని చెప్పి అమ్మేస్తున్నారు. కోర్టు ఆదేశాలు ఉన్నా.. నిర్మాణాలు జరుగుతున్నాయి. అమీన్ పూర్ పెద్ద చెరువు ప్రాంతంలో ఓ రాజకీయ నాయకుడు చెరువు సమీపంలోని తమ ప్లాట్లను ఆక్రమించుకుని లేఔట్ అభివృద్ధి చేయడంతో కూల్చి వేశారు.
ఇక కిష్టారెడ్డిపేట, బీరంగూడ వంటి ప్రాంతాల్లో అనేక ఆక్రమణలు ఉన్నాయి. హైడ్రా వారందరికీ నోటీసులు జారీ చేసింది.