నువ్ ఏది ఇస్తే అదే తిరిగి వస్తుందన్న ఓ నానుడి ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఓ సందర్భంలో ఉపయోగించి ఉంటారు. మంచి అయినా..చెడు అయినా.. ఇదే జరుగుతుంది. అధికారం ఉందని రెచ్చిపోయిన వైఎస్ఆర్సీపీ ప్రజాస్వామ్యాన్ని కాలరాచి స్థానిక ఎన్నికలను ఏకపక్షంగా నిర్వహించుకుంది. దాడులు, దౌర్జన్యాలతో మాత్రమే కాదు అధికార దుర్వినియోగం చేసి నామినేషన్లను తప్పుడు సంతకాలు చేసి మరీ ఉపసంహరింప చేశారు. ఇలాంటి పనులు చేస్తే రేపు అధికారంలోకి వచ్చే వారూ అదే చేస్తేతమ పరిస్థితి ఏమిటన్నది ఆలోచించలేదు. అసలు ఎదుటి వారు అధికారంలోకి రారు కదా అనుకున్నారు.
ఎదుటివారు అధికారంలోకి రారు అన్నంత ధీమా ఉంటే నేరుగా ప్రజలకు ఓట్లు వేసే చాన్స్ ఇవ్వాల్సింది కానీ అలాంటి అవకాశం కూడా కల్పించకుండా చేశారు. ఇప్పుడు దానికి ప్రతిఫలం అనుభవిస్తున్నారు. చైర్మన్లు, వైఎస్ చైర్మన్లు, డిప్యూటీ మేయర్లు, స్టాండింగ్ కమిటీలకు జరుగుతున్న ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క పోస్టు కూడావైసీపీకి దక్కడం లేదు. అన్ని తెలుగుదేశం పార్టీ ఖాతాలోనే పడుతున్నాయి. తామే నియమించిన ఎస్ఈసీ నీలం సాహ్ని ఉన్నారని అందరిపై అనర్హతా వేటు వేయిస్తామని హెచ్చరిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అందరూ టీడీపీ తరపున చదువులకు ఎన్నికవుతున్నారు.
ఎన్నికలు ఎలా నిర్వహించకూడదో వైసీపీ అలా నిర్వహించింది. చివరికి టీడీపీ ఎన్నికలను బహిష్కరించాల్సి వచ్చింది. ఇప్పుడు టీడీపీ నేతలు చూపిస్తున్నది శాంపిల్ మాత్రమే. అసలు స్థానిక ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. అప్పటికి వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. గగ్గోలు పెట్టి ఎన్నికలను బహిష్కరిస్తుంది. కానీ అప్పటికే క్యాడర్ అంతా జారిపోయి ఉంటారు. వైసీపీ హయాంలో జరిగినట్లుగా దాడులు, దందాలు, కేసులు , కిడ్నాపులు చేయాల్సిన అవసరం ఉండదు.
జగన్ రెడ్డి అధికారం అందగానే ఎన్ని తప్పులు చేయకూడదో అన్నీ చేశారు. ఇప్పుడు ప్రతి తప్పు ఆయనను వెంటాడుతోంది. దాని ప్రతిఫలం ఆయన రుచి చూస్తున్నారు. వచ్చే నాలుగేళ్ల పాటు తాను గగ్గోలు పెట్టే… ప్రతి అంశంపైనా ఆయన గగ్గోలుకు విశ్వసనీయత ఉండదు.ఎందుకంటే అంతకు మించి ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసి ఉంటారు మరి.