హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అత్యంత ఘోరంగా పడిపోయిదని బిల్డర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు చేస్తోంది. జీడిమెట్లలో ఓ బిల్డర్ తన ఫ్లాట్లు అమ్ముడుపోక ఆత్మహత్య చేసుకున్నారన్న ప్రచారంతో.. అత్యంత ఘోరంగా ఉందన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. అయితే మార్కెట్ ను పరిశీలిస్తే రియల్ ఎస్టేట్ కరెక్షన్ లో ఉంది కానీ.. ఘోరంగా లేదని అర్థం చేసుకోవచ్చు.
వ్యాపారం అన్న తర్వాత అనేక సమస్యలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ లో ఎక్కువ ఉంటాయి. పెట్టుబడి భారీగా ఉంటుంది. దానికి తగ్గట్లుగా ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకునే పరిస్థితి ఉండాలి. అలా లేకపోతే ఏ వ్యాపారంలో అయినా ఆత్మహత్యలు తప్పవన్నట్లుగా మారుతాయి. అనేక వ్యాపారాల్లో నష్టపోయిన వారు మరో దారి లేదని భావించి ప్రాణాలు తీసుకుంటూ ఉంటారు. అంత మాత్రాన ఆ రంగం ఎత్తిపోయిందని చెప్పడానికి లేదు. బిల్డర్ ఆత్మహత్య చేసుకున్నారన్నదాన్ని మొత్తం రియల్ ఎస్టేట్ కు అన్వయింపచేయలేం.
ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ డిమాండ్ పడిపోయింది. ఆర్బీఐ విపరీతంగా వడ్డీ రేట్లు పెంచడానికి తోడు..ఎన్నికలు.. కూడా దీనికి కారణం. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడిప్పుడే పరిస్థితి కుదుటపడుతోంది. హైడ్రా భయం అనేది డిమాండ్ ను తగ్గించడం దాదాపుగా అసాధ్యం. చట్టబద్దంగా ఉన్న ఏ నిర్మాణాన్ని ఏ ప్రభుత్వ వ్యవస్థ కూడా కూల్చే సాహసం చేయదు. ఆ విషయం కొనుగోలుదారులకు అవగాహన ఉంటుంది.
ప్రస్తుతం హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పుంజుకుంటోంది. రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. ఎంక్వయిరీలు కూడా పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కొంత కాలం నుంచి ధరల్లో పెరుగుదల లేకపోవడం కూడా డిమాండ్ పెరగడానికి కారణంగా కనిపిస్తోంది. మొత్తంగా రియల్ ఎస్టేట్ రాజకీయం చేస్తున్నంత ఘోరంగా లేదు. పైగా ఇప్పుడిప్పుడే పరుగందుకుంటోంది.