ఒక రేంజ్ లో చేశాడు చంద్రబాబు భజన. తను మాత్రమే కాదు.. తన కులం మొత్తం చంద్రబాబుకు అనుకూలంగా మారిపోయిందని కూడా సెలవిచ్చేశాడు. జగన్ వేస్ట్.. చంద్రాబు సూపర్ అని అవకాశం ఉన్నప్పుడల్లా ఢంకా భజాయించాడు. అయితే అసలు కోరిక మాత్రం తీరడం లేదు! ఈ రోజు జరుగుతున్న కేంద్ర మంత్రి వర్గ విస్తరణ.. అనంతపురం ఎంపీ దివాకర్ రెడ్డిని చాలానే బాధపెడుతోంది. ఎందుకంటే.. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని దివాకర్ రెడ్డి చాలా కలలనే కన్నాడు. మోడీ మంత్రి వర్గంలో తనకు స్థానం ఇప్పించాలని చంద్రబాబుకు చాలా రకాలుగానే విన్నవించుకున్నాడు దివాకర్ రెడ్డి.
అందులో భాగమే.. వివిధ సందర్భాల్లో దివాకర్ రెడ్డి చంద్రబాబును అనేక రకరకాలుగా ప్రశంసించడం. జీవితంలో చాలా పదవులనే చూశాడు దివాకర్ రెడ్డి. కాంగ్రెస్ ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన దివాకర్ రెడ్డి గత ఎన్నికల ముందు తెలుగుదేశంలో చేరి కూడా రాజకీయంగా నిలదొక్కుకున్నాడు. తనకు ఏ పార్టీ అయినా ఒకటే.. ఎక్కడి నుంచి అయినా గెలవగలను అని నిరూపించుకున్నాడు. మరి ఇన్ని సాధించిన ఈయన వచ్చే ఎన్నికల్లో తను పోటీ చేయనని కూడా ఇప్పటికే ప్రకటించేశాడు. మరి ఈ చివరి మూడేళ్లలో కేంద్రమంత్రి అనిపించుకోవాలని తపించాడు దివాకర్ రెడ్డి. సీనియర్ ను, అనుభవజ్ఞుడిని కాబట్టి కనీసం కేంద్రంలో సహాయ మంత్రి పదవిని అయినా ఇప్పటించాలని చంద్రబాబుకు జేసీ పలు మార్లు విజ్ఞప్తి చేసుకున్నాడు. తనదైన శైలిలో చూద్దాం.. చేద్దాం.. అని బాబు సమాధానాలిచ్చారు.
ఈ నేపథ్యంలో బాబును రంజింపచేయడానికి దివాకర్ రెడ్డి చాలానే కష్టపడ్డాడు. అనంతపురం జిల్లాలో వివిధ సందర్భాల్లో బాబు పర్యటనల సందర్భంగా భజన చాలా గట్టిగా చేశాడు జేసీ. చంద్రబాబు రుణమాఫీ చేసేశాడని.. చంద్రబాబు మగాడు అని.. చంద్రబాబుకు రెడ్లు మొత్తం దాసోహం అంటున్నారని.. రెడ్లంతా చంద్రబాబును అభిమానిస్తున్నారని.. జేసీ వ్యాఖ్యానిస్తూ వచ్చాడు. ఇంతజేసినా బాబు జేసీ కోసం ఢిల్లీలో గట్టిగా లాబీయింగ్ చేయలేదు. కేంద్ర మంత్రి వర్గంలో కొత్తగా మరికొంతమంది తెలుగుదేశం ఎంపీలకు స్థానం కల్పించడం గురించి బాబు బీజేపీ వాళ్లతో ఎలాంటి చర్చలూ జరపినట్టుగా కనిపించడం లేదు. దీంతో జేసీతో పాటు ఇలా ఆశలు పెట్టుకున్న మరికొంతమంది ఎంపీలు కూడా నిరాశ పడ్డారు.