గీతా ఆర్ట్స్ సంస్థని అన్నీ తానై నడిపిస్తున్నాడు బన్నీవాస్. పెట్టుబడి అల్లు అరవింద్ దే కావొచ్చు. కానీ సెట్లో ఉండి, అన్నీ దగ్గరుండి చూసుకొనేది మాత్రం బన్నీ వాసే. జీఏ, జీఏ 2 నుంచి వస్తున్న సినిమాలకు ఆయన అధికారిక నిర్మాత. ‘తండేల్’ సినిమాకూ నిర్మాతగా బన్నీ వాస్ పేరే పడింది. అయితే బన్నీ వాస్ గీతా ఆర్ట్స్ నుంచి బయటకు వస్తున్నారని, ఆయన సొంతంగా బ్యానర్ పెడుతున్నారన్న వార్తలు వినిపించాయి. వాటిపై తెలుగు 360 ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు బన్నీవాస్.
తాను గీతా ఆర్ట్స్ నుంచి బయటకు రావడం లేదని, కాకపోతే… తనకు నచ్చిన కథల్ని, తాను నిర్మాతగా, సొంత డబ్బులతో సినిమాలు తీసుకొంటానని ఆయన క్లారిటీ ఇచ్చారు. ”నాకు నచ్చిన కొన్ని కథలు అరవింద్ గారికి నచ్చవు. అలాంటి కథలతో నాకు సినిమాలు తీయాలని వుంది. ఇదే విషయం అరవింద్ గారికి చెప్పా. దానికి అరవింద్ గారు కూడా ఒప్పుకొన్నారు. నేను వేరేగా సినిమా తీసినా, అది జీఏ 2 బ్యానర్లోనే ఉంటుంది” అని స్పష్టం చేశారు. గీతా ఆర్ట్స్ పెద్ద సంస్థ. ఈ సంస్థ నుంచి సినిమా మొదలయ్యేటప్పుడే నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడైపోతాయి. ఓటీటీలకు అంత నమ్మకం. అందుకే బన్నీ వాస్ సొంతంగా సినిమా తీసినా, జీఏ 2లోనే చేస్తానంటున్నాడు. ఇప్పుడు కొత్తగా ఓ బ్యానర్ పెట్టి, దాన్ని పాపులర్ చేయడం బదులు… ఉన్న బ్యానర్‌నే వాడుకోవడం ఉత్తమం. అయితే.. అల్లు అరవింద్ తనకు సంబంధం లేని సినిమాలకు తన బ్యానర్‌ని వాడుకొనేంత సౌలభ్యం బన్నీ వాస్‌కి ఇస్తారా? అనేది చూడాలి. బన్నీకి బన్నీవాస్ ఎంత కావాల్సిన వాడో చెప్పాల్సిన పని లేదు. కాబట్టి ఆ బ్యానర్లో సినిమాలు తీసుకొనే అవకాశం బన్నీ వాస్‌కి ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.