ఒకప్పటి అగ్ర హీరోలు చిరంజీవి, వెంకటేష్, బాలకష్ణ.. ఇప్పటికీ ఫామ్ లోనే ఉన్నారు. చిరు ‘విశ్వంభర’ చేస్తున్నాడు. ఆ తరవాత చేయబోయే రెండు సినిమాలపై క్లారిటీ వుంది. బాలకృష్ణ సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఈ ఇన్నింగ్స్ లో బాలయ్య పట్టిందల్లా బంగారమే. వెంకటేష్ ఈమధ్యే ‘సంక్రాంతికి వస్తున్నాం’తో కనీ వినీ ఎరుగని విజయం అందుకొన్నారు. వెంకీ స్టామినాని నిరూపించిన సినిమా ఇది. కాకపోతే నాగార్జున కాస్త సైలెంట్ గా ఉండడం అక్కినేని అభిమానుల్ని ఇబ్బంది పెడుతోంది.
నాగ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. కాకపోతే అవి రెండూ సోలో సినిమాలు కావు. శేఖర్ కమ్ముల ‘కుబేర’లో నాగ్ కీలక పాత్రధారి. రజనీకాంత్ ‘కూలీ’లో కూడా అంతే. ఈ రెండు సినిమాలు ఎంత బాగా ఆడినా నాగ్ కెరీర్‌కి కొత్తగా ప్లస్ అయ్యేది ఏం ఉండదు. సోలో హీరోగా వచ్చి, హిట్ కొడితేనే ఫ్యాన్స్ హ్యాపీ అవుతారు. కెరీర్‌కీ ఓ స్పీడు వస్తుంది. కానీ నాగ్ ఎందుకో ఆ దిశగా ఆలోచించడం లేదు. నాగ్ కొత్తగా ఒప్పుకొన్న సినిమాలేం లేవు. ఆయన ఈమధ్య కొత్త కథలు కూడా వినడం లేదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కుబేర, కూలీ అయిపోయిన తరవాతే.. నాగ్ కొత్త కథలు వింటారా? అప్పటి వరకూ ఆయన ఈ స్పేస్ లో లేరా? అనిపిస్తోంది. చిరు, బాల, వెంకీలను చూసైనా నాగ్ స్పీడందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మహా అయితే ఈ టాప్ హీరోల కెరీర్ మరో మూడు నాలుగేళ్లు ఉంటుందేమో? ఆ తరవాత కూడా హీరోగా చేస్తానంటే జనం చూసే పరిస్థితి ఉండదు. ఈలోగానే.. నాగ్ సోలో హీరోగా వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేస్తే చూడాలన్నది అక్కినేని అభిమానుల ఆశ.