బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. ఈ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. స్పీకర్ కు తాము ఫిర్యాదు చేసినా కనీసం నోటీసులు ఇవ్వలేదన్నారు. పదో తేదీన రెండు పిటిషన్లపై విచారణ జరగనుంది. గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారని అసెంబ్లీ కార్యదర్శిని ప్రశ్నించింది.
దీంతో స్పీకర్ పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఫలానా తేదీలోపు వివరణ ఇవ్వాలని ఏమీ అడగలేదు. ప్రాసెస్ లో ఉందని సుప్రీంకోర్టుకు చెప్పడానికి ఈ నోటీసులు ఉపయోగపడతాయి. స్పీకర్ ఫిర్యాదులపై స్పందించారని ఎమ్మెల్యేల వివరణ తీసుకుంటారని సుప్రీంకోర్టుకు చెబుతారు. ఫలానా తేదీలోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించే అవకాశాలు దాదాపుగా ఉండవు. సభా వ్యవహారాల్లో స్పీకరే సుప్రీం అని న్యాయనిపుణులు చెబుతున్నారు
స్పీకర్ నిర్ణయంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు వెనక్కి పోయే పరిస్థితి కూడా ఉండదు. ఇటీవల కొంతమంది ఎమ్మెల్యేలు వెనక్కి వెళ్తున్నారన్న ప్రచారం జరిగింది. దానం నాగేందర్, మహిపాల్ రెడ్డి వంటి వాళ్లు తేడాగా ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా వెనక్కి వెళ్లాలనుకుంటే స్పీకర్ వారిపై అనర్హతా వేటు వేస్తారు. బీఆర్ఎస్ ఫిర్యాదు మేరకే వేశామని చెబుతారు. ఇప్పుడు తప్పనిసరిగా ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో ఉండాల్సిందే.