సైమా అవార్డుల ప్రధానోత్సవంలో నయనతార తీరు ఇప్పటికే చర్చ నీయాంశంగా మారింది. ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఒక తమిళ సినిమాకు గానూ ఉత్తమ నటి అవార్డు అందుకున్న నయన తన తీరుతో అవార్డుల కార్యక్రమం నిర్వాహకులను, ఒక హీరోను చాలా ఇబ్బంది పెట్టేసింది. తన సన్ని హితుడు విఘ్నేష్ శివన్ చేతిలో అవార్డును అందుకోవాలన్న తన ఆసక్తి ని అప్పటికప్పుడు వ్యక్త పరిచి కార్యక్రమంలో కలకలం పుట్టించింది నయన. దీంతో నిర్వాహకులు ఇబ్బంది పడ్డారు, ఒక హీరో తనకు అవమానం కలిగిందని భావించాడు!
అసలు కథేమిటంటే.. ‘నేనూ రౌడీనే’ సినిమా తమిళ వెర్షన్ కు గానూ ఉత్తమ నటి అవార్డును పొందింది నయనతార. ఆమెను అవార్డుకు ఎంపిక చేసిన కమిటీ.. ఆమెకు తెలుగు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా అవార్డును ఇప్పించాలని భావించింది. ఆ మేరకు అల్లు అర్జున్ వేదిక మీదకు పిలిచింది. అల్లువారబ్బాయి చేత అవార్డును ఇప్పించడానికి నయనను వేదిక మీదకు పిలిచారు. అయితే తనకు విఘ్నేష్ చేతుల మీదుగా అవార్డును అందుకోవాలని ఉందని నయన బాంబు పేల్చింది. దీంతో చేసేది లేక నిర్వాహకులు వేదిక కింద ఉన్న ఆ తమిళ దర్శకుడిని పిలిపించి నయన కోరికను తీర్చారు!
సన్నిహితుడి చేతి నుంచి అవార్డును అందుకున్నందుకు ఆమె మురిసిపోయింది కానీ.. వేదిక మీద వరకూ వచ్చి, వెనుదిరిగిన అల్లు అర్జునే అవమానంలా ఫీలయ్యాడని తెలుస్తోంది. ఈ విషయంలో అటు నిర్వాహకుల పై, నయనపై అల్లు అర్జున్ ఆగ్రహం వ్యక్తం చేశాడని సమాచారం. అంతగా విఘ్నేష్ తో అవార్డును అందుకోవాలని కోరిక ఉండుంటే.. ఆ విషయంపై నయన నిర్వాహకులతో ముందే మాట్లాడుకుని ఉండొచ్చు కదా? అనేది అల్లు అర్జున్ ప్రశ్న. నయన ఇలా ట్విస్టు ఇస్తుందని తమకు కూడా తెలియదని నిర్వాహకులు తెలుగు హీరోకి క్షమాపణలు చెప్పుకున్నట్టు సమాచారం.