ఈనెల 7న ‘తండేల్’ విడుదల అవుతోంది. ఏపీ ప్రభుత్వం తండేల్ టికెట్ రేట్లు పెంచుకొనే అవకాశం కల్పించింది. సింగిల్ స్క్రీన్కు రూ.50, మల్టీప్లెక్స్ కు రూ.75 పెంపుకు అంగీకరిస్తూ జీవో విడుదల చేసింది. తెలంగాణలో రేట్ల పెంపుకోసం నిర్మాతలు.. ప్రభుత్వాన్ని సంప్రదించలేదు. కాబట్టి.. ఇక్కడ హైక్ లేదు. అలాంటప్పుడు ఏపీలో ఎందుకు? తెలంగాణలో సంక్రాంతి సినిమాలకు సైతం టికెట్ రేట్ల పెంపు లేదు. మామూలు రేట్లకే తెలంగాణలో టికెట్లు అమ్మారు. ఇప్పుడు ‘తండేల్’ వంతు వచ్చింది.
‘తండేల్’ స్టార్ ఇమేజ్ ఉన్న సినిమా కాదు. నాగచైతన్య సినిమా అంటే ఓపెనింగ్స్ పోటెత్తేయడం అంటూ ఉండవు. సినిమా బాగుంటే మాత్రం జనాలు థియేటర్లకు వస్తారు. అంటే మౌత్ టాక్ బయటకు రావాలి. ఇటీవలే సంక్రాంతికి మూడు సినిమాలు చూశారు ఆడియన్స్. ఆ సమయంలో టికెట్ రేట్లు పెరిగాయి. సంక్రాంతి సీజన్, పైగా పెద్ద హీరోల సినిమాలు. కాబట్టి రేట్లు పెంచినా చూశారు. నెల కూడా తిరక్కుండా ‘తండేల్’ వస్తోంది. రూ.50, రూ.75 చిన్న అంకెల్లానే కనిపించొచ్చు. కానీ… నాగచైతన్య సినిమాక్కూడా టికెట్ రేట్లు పెంచుకోవడం అనేది ఉత్తమ మైన నిర్ణయం కాదు. ముందు సినిమా అనేది జనాల్లోకి వెళ్లాలి. అలా వెళ్లాలంటే… టికెట్ రేట్లు అందుబాటులో ఉండాలి. పెద్ద సినిమాలకు ఎలాగూ టికెట్ రేట్లు పెంచుకోవొచ్చు. స్టార్ సినిమా, భారీ బడ్జెట్ చిత్రాలకే ఇలాంటి మినహాయిపులు ఇస్తే బాగుంటుంది. ప్రభుత్వం అనుమతులు ఇస్తోంది కదా అని, మిడ్ రేంజ్ సినిమాలకూ అదే సూత్రం వర్తించాలనుకోవడం తెలివైన నిర్ణయం కాదు.