కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఎలా అయితే రాజుకునేలా చేశారో.. బీసీ ఉద్యమాన్ని అలాగే రాజుకుని చేసేలా చేసి..తాను ముఖ్యమంత్రి అయిపోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గట్టి పట్టుదలగా ఉన్నారు. అందుకే బీసీలకు అవకాశాలు అంటూ… ఇతర ఓసీ సామాజికవర్గాలపై దారుణమైన వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. ఇతర వర్గాలపై బీసీలను రెచ్చగొడితే అందరూ ఏకమవుతారని.. తన నాయకత్వంలో బీసీ ఉద్యమం తెచ్చి.. మెజార్టీ జనం ఉన్న బీసీల ఓట్లతో తాను సీఎం అవుతానని ఆయన అనుకుంటున్నారు. అందుకే సీఎం నినాదాలు కూడా చేయించుకుంటున్నారు.
మల్లన్న తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు. సమాజంలో చిచ్చు పెడుతున్నారా లేదా అన్న విషయం పక్కన పెడితే ఆయన ఇప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ. సొంతంగా పోటీ చేస్తే గెలుపునకు దూరంగా ఉంటున్నానని ఎలాగైనా గెలిచి తీరాలని ఆయన కాంగ్రెస్ లో చేరారు. ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు దక్కకపోవడంతో ఎమ్మెల్సీ టిక్కెట్ సాధించుకున్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన సీటులో గెలిచారు. అయితే ఆయన ఇప్పుడు టిక్కెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడుతున్నారు. రేవంత్ రెడ్డిపైనా ఘోరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన తీరు చూసి చాలా మంది కాంగ్రెస్ నేతలు నొచ్చుకుంటున్నారు. అటువంటి వ్యక్తికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అనే ట్యాగ్ ఎందుకని వెంటనే సస్పెండ్ చేయాలన్న సూచనలు చేస్తున్నారు.
అయితే బీసీ ఉద్యమం చేస్తున్న తీన్మార్ మల్లన్న ను సస్పెండ్ చేస్తే బీసీని కాబట్టి సస్పెండ్ చేశారని ఆయన ఆరోపించే అవకాశం ఉంది. ఇప్పుడు అంత అవసరమా అన్న ఆలోచనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఎలా చూసినా ఎమ్మెల్సీగా ఓ నెంబర్ కాంగ్రెస్ ఖాతాలో ఉంటుంది. ఆయనను సస్పెండ్ చేస్తే అది కూడా ఉండదు. ఈ కారణంగా ఇంకా ఆయనను కనీసం వివరణ కూడా అడగలేకపోతున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే ఇలాగే ఆయన వ్యాఖ్యలు చేస్తూ పోతే కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అవుతుందని క్యాడర్ కంగారు పడుతున్నారు.