హోమ్ లోన్స్ విషయంలో కొన్ని సంస్థలు అనుసరిస్తున్న వైఖరి లోన్లు తీసుకున్న వారికి పెను భారంగా మారుతోంది. ఆర్బీఐ రెపోరేటు మార్చినప్పుడు తప్పనిసరిగా వడ్డీ రేట్లు పెంచుతారు. కానీ పెంచనప్పుడు కూడావడ్డీ రేట్లను పెంచుతున్న సంస్థలు ఉన్నాయి. మళ్లీ వాటిని కట్టాలంటే.. డబ్బులు కట్టాలనే మెసెజులు పంపుతూంటాయి. ఇలాంటి వాటిలో ఎల్ఐసీ హోమ్ ఫైనాన్స్ ఒకటి.
ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ సంస్థ ఇటీవల తన ఖాతాదారులందరికీ వడ్డీ రేట్లు పెంచుతున్నట్లుగా సందేశాలు పంపింది. సిబిల్ స్కోర్ ఆధారంగా కొంత మందికి పదిన్నర వరకూ వడ్డీ రేట్లును వసూలుచేస్తోంది. మంచి సిబిల్ స్కోర్ ఉన్న వారికి కూడా 9 శాతంపైనే వడ్డీ వసూలు చేస్తోంది. అయితే ఇక్కడ వినియోగదారులలో ప్రధానంగా అసంతృప్తి ఎందుకు కనిపిస్తోందంటే.. వడ్డీ రేట్లు తగ్గించాలనుకుంటే ఆ సంస్థకు ఎంతో కొంత ఫీజు కట్టాలి. కానీ పెంచాలనుకుంటే మాత్రం ఇష్టం వచ్చినట్లుగా పెంచేసి సందేశం పంపిస్తారు.
ఆర్బీఐ వడ్డీరేట్లు పెంచిన తర్వాత ఈ సంస్థ కూడా వడ్డీ రేట్లను పెంచింది. అయితే తర్వాత సిబిల్ స్కోర్ ఆధారంగా తగ్గించుకునే స్కీమ్ పెట్టింది. అందులో భాగంగా ఒక్కొక్కరి దగ్గర మూడు వేలకుపైగా వసూలు చేశారు. మంచి సిబిల్ స్కోర్ ఉన్న వారికి 8.9 శాతం వడ్డీ వసూలు చేశారు. ఇది లోయస్ట్ అని ఆ సంస్థ ప్రకటించుకుంది. ఇప్పుడు ఆ వడ్డీరేటును పెంచేశారు. తగ్గించుకోవాలంటే మళ్లీ మూడు వేలు కట్టాలని సందేశం పంపుతున్నారు.
ఇక సిబిల్ స్కోర్ సరిగ్గా లేని వారికి పది నుంచి పదకొండు శాతం వరకూ వసూలు చేస్తోంది. ఈఎంఐలు పెంచడం లేదు కానీ.. డ్యూరేషన్ పెంచుతోంది. ఫలితంగా ఇటీవల లోన్లు తీసుకున్న వారు ఇరవై ఏళ్ల కాలపరిమితి పెట్టుకుంటే అది మరో పదేళ్లు పెరుగుతోంది. ఇలాంటి వాటి వల్ల కొత్తగా ఇళ్లు కొనాలనుకునేవారు కూడా వెనుకడుగు వేసే పరిస్థితి వచ్చింది.