సింగనమల రమేష్… ఒకప్పుడు భారీ సినిమాలతో ఇండస్ట్రీ చూపుని తన వైపు తిప్పుకొన్న నిర్మాత. `కొమరం పులి`, `ఖలేజా` సినిమాలు ఆయన సంస్థ నుంచే వచ్చాయి. చాలా సినిమాలకు ఫైనాన్షియర్‌గా వ్యవహరించారు. అయితే.. వరుస పరాజయాలు ఆయన్ని కుదిపి వేశాయి. ఆయనపై పలు రకాల కేసులు నమోదవ్వడం, జైలు పాలవ్వడంతో దాదాపు 14 ఏళ్ల పాటు చిత్రసీమకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఆయా కేసుల నుంచి విముక్తి లభించింది. దాంతో.. తిరిగి మీడియా ముందుకు వచ్చారు. ఇక మీదట ఇంకా శ్రద్ధతో, జాగ్రత్తతో సినిమాలు తీస్తానని సింగనమల ప్రకటించారు. ఈ సందర్భంగా కొమరం పులి, ఖలేజా సినిమాలు, వాటి ఫలితాల పట్ల కీలక వ్యాఖ్యలు చేశారు.
కొమరం పులి, ఖలేజా సినిమాలతో దాదాపు రూ.100 కోట్లు పోయాయని, అయితే ఆయా హీరోలేం తనని ఆదుకోలేదని, కేసులపాలై జైలుకి వెళ్లినప్పుడు కూడా ఎవరూ తనని పరామర్శించలేదని, పరిశ్రమ నుంచి కూడా సపోర్డ్ దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజుల్లో ఒక్కో సినిమాకీ మూడు నాలుగేళ్ల సమయం పడుతోందని, కానీ పులి లాంటి సినిమాని అప్పట్లో మూడేళ్లు తీయాల్సివచ్చిందని, అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టడం వల్ల, పవన్ ఆ పార్టీకే సమయం కేటాయించారని, అందుకే పులి సినిమా ఆలస్యమైందని పేర్కొన్నారు. ఇక మీదట కథకే పెద్ద పీట వేసి సినిమాలు తీస్తానని, కాంబినేషన్ల వెంట పడనని, అన్నీ తానై చూసుకొనే వెసులు బాటు ఉంటేనే సినిమాలు తీయాలని, లేదంటే నిర్మాతలు ఇంట్లో కూర్చోవాలని హితవు పలికారు సింగనమల.