స్కూల్ యూనిఫారమ్ లో కనిపించే హీరో.. యూనిఫారమ్ లోనే మినీ స్కర్ట్ లో కనిపించే హీరోయిన్.. హీరోకి నూనుగు మీసాలు కూడా లేవు.. మొన్నటి వరకూ వివిధ సినిమాల్లో చిన్న పిల్ల గాకనిపించిన హీరోయిన్ కు ఈ సినిమాలోనూ పసిదనం పోయినట్టుగా కనిపించడం లేదు. ‘నిర్మలాకాన్వెంట్’ ట్రైలర్ తో కేవలం ఈ విషయాలే కాదు, ఇదొక ప్రేమకథ కూడా అని స్పష్టం అవుతోంది. మరి పాలబుగ్గల పసివాళ్లతో ప్రేమకథ ఏమిటి? కుర్రాడు ప్రేమ విషయంలో ఛాలెంజ్ చేయడం ఏమిటి? అనేది అంతుబట్టిన అంశంగా మారింది.
అది కూడా నాగార్జున వంటి స్టార్ హీరో ఈ సినిమా వెనుక ఉండటం.. ఈ సినిమా ప్రచారానికి ఆయన స్వయంగా రంగంలోకి దిగడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. హీరో శ్రీకాంత్ కుమారుడు ఈ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. జై చిరంజీవ, దూకుడు వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన చిన్న పాప ఇందులో హీరోయిన్. ఈ సినిమాకు స్టిల్స్ లో, ట్రైలర్ లో హీరోహీరోయిన్లిద్దరూ స్కూల్ యూనిఫారమ్ లో కనిపించడంతో ఈ సినిమాపై అదోరకమైన ఇంప్రెషన్ కలుగుతోంది.
టీనేజ్ ప్రేమకథలను తెరకెక్కించడం తప్పేం కాకపోవచ్చు కానీ.. టెన్త్, ఇంటర్ దశలో ఉన్న వారిని హీరోహీరోయిన్లుగా చూపుతూ వారికి కూడా ప్రేమ ప్రధానం అనే సందేశం ఇవ్వడం మాత్రం ఏ మాత్రం సమర్థనీయం కాదు. ఈ సినిమా టీజర్ చూస్తుంటే ఆ చిన్న పిల్లలతో ప్రేమ, రొమాన్స్ వంటి సన్నివేశాలు చూడటం కూడా కష్టమే అనే అభిప్రాయం కలుగుతోంది. గతంలో ‘టెన్త్ క్లాస్’ వంటి సినిమాలు వచ్చాయి.. ఇలాంటి వాటి తో సమాజానికి నష్టమే తప్ప లాభం లేదు.. ఇలాంటి సినిమాలను ఏ మాత్రం ఎంకరేజ్ చేయొద్దు.. అని కొంతమంది పిలుపునిస్తున్నారు.