సింగనమల రమేష్.. ఒకప్పుడు ఈ పేరు టాలీవుడ్ లో గట్టిగానే వినిపించింది. మహేష్, పవన్ కలాంటి స్టార్లతో సినిమాలు చేసిన నిర్మాత. ఫైనాన్షియర్. చాలా సినిమాలకు పెట్టుబడి పెట్టాడు. అందుకే సింగనమల పేరు మార్మోగింది. అయితే 14 ఏళ్ల పాటు ఆయన కామ్ అయ్యారు. దానికి రకరకాల కారణాలు. ఇప్పుడు మీడియా ముందుకొచ్చారు. సినిమాలు తీస్తా అంటున్నారు. తనని ఈ 14 ఏళ్ల పాటు హీరోలెవరూ పట్టించుకోలేదని, సానుభూతి చూపించలేదని, జైలుకెళ్తే ఎవరూ సపోర్ట్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కొమరం పులి, ఖలేజా సినిమాలకు చాలా హైప్ తో విడుదలయ్యాయి. కానీ ఫ్లాపులు. ఈ సినిమాలతో వంద కోట్ల నష్టం వచ్చిందన్నది సింగనమల లెక్క. హీరోలెవరూ పట్టించుకోలేదని ఆవేదన. సినిమాలు తీసి నష్టపోతే.. హీరోలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే.. నిర్మాత కాస్త నిలదొక్కుకోవడానికి మళ్లీ అతని బ్యానర్లోనే సినిమాలు తీసి, నష్టభారం తగ్గిస్తారు. కానీ మళ్లీ సినిమాలు తీయడానికి నిర్మాత ఏడీ? ఆయన వెళ్లి జైల్లో కూర్చున్నారు.
సింగనమలపై నమోదైన కేసులు ఒకటీ రెండూ కావు. లెక్కలేనన్ని. ఒకే భూమిని 20 మందికి అమ్మేశారన్నది ఆయపై ఉన్న ప్రధానమైన అభియోగం. ఇలాంటి ఆర్థిక నేరాలు చేసి జైలుకెళ్తే చిత్రసీమ ఎందుకు సపోర్ట్ చేస్తుంది? హీరోలెందుకు పరామర్శిస్తారు? సినిమా అనేది పేకాటతో సమానం. ముక్కలు పడినంత కాలం, చేయి తిరిగినంత కాలం బాగానే ఉంటుంది. ఒక్కసారిగా అదృష్టం తిరగబడుతుంది. అప్పుడు పక్కన నిలబడడానికి కూడా ఎవరూ ఉండరు. ఈ విషయం చాలామంది నిర్మాతల స్వీయ అనుభవమే.
నిర్మాత అనేవాడు ఎలా ఉండాలి? అన్ని విషయాల్లోనూ అనుభవం ఉండాలి. అన్నీ దగ్గరుండి చూసుకోవాలి. `నేను అదేం చేయలేదు` అని సింగనమలనే స్వయంగా చెబుతున్నారు. అలాంటప్పుడు ఎదురు దెబ్బలు పడకుండా ఎలా ఉంటాయ్?
ఇక మీదట జాగ్రత్తగా ఉంటా, పద్ధతిగా సినిమాలు తీస్తా అనేది సింగనమల మాట. పోనీ.. ఇప్పటికైనా కళ్లు తెరచుకొన్నాయి. నిర్మాత చేయాల్సింది అదే. కథలపై దృష్టి పెట్టాలి. కాంబినేషన్ వెంట పరుగులు పెట్టడం ఆపాలి. సింగనమల అవి చేయగలిగితే నిర్మాతగా ఆయనకు మనుగడ ఉంటుంది. సింగనమల జీవితం ఇప్పటి నిర్మాతలకు పాఠం లాంటిది. ఆ తప్పుల జోలికి వెళ్లకుండా ఉంటే – నిర్మాతగా లాంగ్ ఇన్నింగ్స్ ఉంటుంది.